జ‌గ‌న్ ట్రేడ్ మార్క్ ఇక వ‌దిలేసుకోవాల్సిందేనా..!

RAMAKRISHNA S.S.
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహనరెడ్డి ట్రేడ్ మార్క్ ఏంటి.. ? `మాట తప్పడు.. మడమ తిప్పడు అని!. దీనిని అప్ప‌టి వైసీపీ మంత్రులు కొడాలి నాని, రోజా, పేర్ని నాని..స‌హా స‌ల‌హాదారులు కూడా ప‌దే ప‌దే చెప్పారు. కానీ, ఇప్పుడు అదే ట్రేడ్ మార్క్‌ను ఆయ‌న వ‌దులు కునే ప‌రిస్థితి వ‌చ్చింది. ఎందుకంటే.. ట్రేడ్ మార్క్‌ను ఆయ‌న ఎక్క‌డా ఐదేళ్ల కాలంలో నిల‌బెట్టుకున్న‌ది లేద‌ని.. వైసీపీ నాయ‌కులే బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

మాట త‌ప్ప‌క‌పోవ‌డం.. అంటే.. జ‌గ‌న్‌దృష్టిలో మేనిఫెస్టోను అమ‌లు చేయడం అనే అనుకుందాం. కానీ, ఇదే 2019 మేనిఫెస్టోలో ఇచ్చిన కీల‌క హామీల‌ను ఆయ‌న క‌నీసం ప్ర‌స్తావించడం కూడా మానుకున్నారు వాటిని అమ‌లు చేయ‌క‌పోగా.. అమ‌లు చేయాల‌న్న వారిపై ఉక్కుపాదం మోపారు. వాటిలో కీల‌క‌మైంది.. కంట్రిబ్యూట‌రీ పింఛ‌న్ స్కీం(సీపీఎస్). ఇది ప్ర‌భుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా 2004 త‌ర్వాత‌.. ఉద్యోగాలు పొందిన వారికి ప్రాణ‌సంక‌టంగా మారింది. దీనిని తాను గ‌ద్దెనెక్కిన తర్వాత‌.. ప‌దిహేను రోజుల్లో ర‌ద్దు చేస్తాన‌ని చెప్పారు.కానీ, ఐదేళ్ల‌యినా.. ర‌ద్దు కాలేదు.

దీనిని క‌ష్ట‌మ‌ని తేల్చేశారు. ఇక, ఎన్నో కష్టమైన విషయాలను చేసుకొచ్చిన జగన్‌మోహనరెడ్డికి మద్య నిషేధం విధించడం సాధ్యం కాదా..? అనేది మ‌రో ప్ర‌శ్న‌. ఎందుకంటే.. విడ‌త‌ల వారీగా మ‌ద్యాన్ని నిషేధిస్తామ‌ని.. హామీ ఇచ్చింది.. ఊరూవాడా చెప్పింది .. జ‌గ‌నే. దీనిని కూడా అమ‌లు చేయ‌లేదు. పైగా.. నాసిర‌కం బ్రాండ్లు పెట్టి.. మ‌ద్యం ధ‌ర‌ల‌ను విప‌రీతంగా పెంచేశారు. ఫ‌లితంగా ఇక్క‌డ కూడా మాట త‌ప్పాడ‌నే మాట‌నే నిజం చేసుకున్నారు.

నేను పేదలకు మంచి చేశాను అని జ‌గ‌న్ ఇప్ప‌ట‌కీ చెబుతున్నారు. కానీ, మద్యనిషేధం, ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పామని స్వయంగా ఆయన కోసం రెండు సార్లు మంత్రి పదవి వదులుకున్న పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వయంగా చెప్పారు. దీంతో జ‌గ‌న్‌కు ఉన్న ఏకైక బ్రాండ్ , ట్రేడ్ మార్క్ అది ఏదైనా కావొచ్చు.. ఏపేరైనా పెట్టుకోవ‌చ్చు. కానీ, ఇప్పుడు అది అభాసుపాలైంది. జ‌గ‌న్ అంటే.. చెప్పుకోవ‌డానికి ఏమీ లేదా? అంటే.. ఉన్నాయి. కానీ, వాటిని. ఓవ‌ర్ టేక్ చేసిన వివాదాస్ప‌ద నిర్ణ‌యాలే ఇప్పుడు హైలెట్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: