అది సైకో పాల‌న‌కు ప్రతిబింబం లాంటిది.. వాటిని ముట్టుకోము: బాబు

Suma Kallamadi
ఆంధ్రా సీఎం చంద్ర‌బాబు నాయుడు తాజాగా ఓ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నట్టు కనబడుతోంది. విషయం ఏమిటంటే, వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చిన రెండు మూడు రోజుల్లోనే అమ‌రావ‌తి ప్రాంతంలో అప్ప‌టి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం హయాంలో ఏర్పాటు చేసిన ‘ప్ర‌జావేదిక‌’ను కేవ‌లం ఒక్క నిర్ణ‌యంతో కూల్చేసిన సంగతి విదితమే. అపుడు వారికి ఈ విషయంలో క‌నీసం కోర్టుకు వెళ్లే స‌మ‌యం కూడా ఇవ్వలేదు. అప్ప‌టి సీఎం జ‌గ‌న్ అప్పటికప్పుడు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల‌తో భేటీ నిర్వ‌హించి అక్క‌డిక‌క్క‌డే.. ఆ భవనాన్ని అక్ర‌మంగా నిర్మించార‌ని, అదేవిధంగా న‌దీగ‌ర్భానికి దీనివ‌ల్ల‌ ప్రమాదం పొంచి ఉందని, న‌దీ తీర ప్రాంతాల్లో నిర్మాణాలు చేయ‌రాద‌నే నెపంతో ప్ర‌జావేదిక భ‌వ‌నాన్ని త‌క్ష‌ణం కూల్చేసిన సంగతి అప్ప‌ట్లో సంచ‌ల‌నంగా మారింది.
దాంతో దీని గురించి తెలుసుకున్న టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి దేవినేని ఉమా వంటివారు హైకోర్టుకు వెళ్లినప్పటికీ పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇక‌, అప్ప‌టి నుంచి ఆ భవనం యొక్క శిథిలాలు అలానే ఉండిపోయాయి. వాటిని ఎవ‌రూ తొలగించిన పాపానపోలేదు. క‌నీసం ఆ ప్రాంతాన్ని వైసీపీ ప్ర‌భుత్వం గ‌త ఐదేళ్ల‌లో శుభ్రం చేసింది కూడా లేదు. ఇక తాజాగా ఇక్క‌డ ప‌ర్య‌టించిన చంద్ర‌బాబు.. ఈ శిధిలాల‌ను చూసి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. "ఆ శిధిలాలను మేం కూడా తొల‌గించం. అవి అక్క‌డే అలానే ఉండాలి. అది ఒక విధ్వంస పాల‌న‌కు, ఒక సైకో ముఖ్య‌మంత్రి పాల‌న‌కు నిద‌ర్శ‌నంగా అక్క‌డే ఉండాలి. మేం వాటి జోలికి వెళ్లబోము!" అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
ఈ సందర్భంగా త‌నను క‌లిసేందుకు భారీ ఎత్తున ప్ర‌జ‌లు గుమిగూడ‌డంతో చంద్ర‌బాబు సంతోషం వ్య‌క్తం చేశారు. అయితే.. అక్కడి పోలీసులు చంద్ర‌బాబును క‌ల‌వ‌కుండా మ‌ధ్య‌లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో వీటిని చూసిన చంద్రబాబు పోలీసుల‌పై సీరియ‌స్ అయ్యారు. "నేనేమీ ప‌ర‌దాల ముఖ్య‌మంత్రిని కాదు. నాకు ప్ర‌జ‌ల నుంచి బెదిరింపులు వంటివి లేవు. ముందు ఆ బారికేడ్లు తొలగించండి. అదే విధంగా మీ మ‌న‌సుల్లోని బారికేడ్లు కూడా తొల‌గించుకోండి!" అని ఘాటుగా స్పందించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ... ప్ర‌జ‌లు త‌న‌ను క‌లిసేందుకు ఎక్క‌డ‌నుంచి ఎప్పుడైనా రావచ్చు. దానికోసం ప్ర‌త్యేకంగా స‌చివాల‌యంలో ఒక ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు తెలిపారు. వ‌చ్చి వెళ్లేందుకు ప్ర‌త్యేక ర‌వాణా స‌దుపాయాన్ని కూడా ఏర్పాటు చేస్తామ‌ని మాటిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: