ఏపీ: ఆ నలుగురిని అదృష్టం వరించింది!

Suma Kallamadi
రాజకీయ క్రీడలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అవును, ప్రజలు ఎప్పుడు ఎవరిని ఆదరిస్తారో కూడా చెప్పడం కష్టం. ఏపీ ఎన్నికల్లో అదే రుజువు అయింది. గత ఎన్నికల్లో 23 శాసనసభ స్థానాలకు పరిమితం అయిన టీడీపీ ఈ ఎన్నికల్లో కూటమి సాయంతో 164 శాసనసభ, 21 లోక్ సభ స్థానాలలో గెలిచి విజయ దుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో కనీసం టికెట్ దక్కడమే కష్టం అనుకున్న 4 మంది ఇపుడు ఏకంగా శాసన సభ్యులుగా గెలిచి చంద్రబాబు మంత్రి వర్గంలో స్థానం దక్కించుకున్నారు. దాంతో అదృష్టవంతులు అంటే ఆ నలుగురే అంటూ రాజకీయ వర్గాలలో వాడివేడి చర్చలు నడుస్తున్నాయి.
ఆ నలుగురు ఎవరంటే సవిత, కొండపల్లి శ్రీనివాసరావు, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్. వీరు నలుగురు ఎమ్మెల్యే టికెట్ల కోసం తీవ్ర పోటీ ఎదుర్కొని గెలిచి ఏకంగా పదవులను అందుకోవడం విశేషం. విజయనగరం జిల్లా, గజపతి నగరం నుండి గెలిచి మంత్రి అయిన కొండపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ముందు వరకు రాజకీయాలకు ఆమడ దూరంలో ఉన్నారు. ఆయన చిన్నాన్న కెఎ నాయుడు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ఈ సారి సర్వేలు అనుకూలంగా లేవని శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వడం జరిగింది. అయినా సొంత కుటుంబం నుండి సహకారం లేకపోయినా బొత్స అప్పలనరసయ్యపై 25 వేల ఓట్లతో గెలిచి ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ ఎంపవర్ మెంట్ శాఖకు మంత్రి అయిపోయాడు.
అదేవిధంగా అనంతపురం జిల్లా, పెనుగొండ నుండి గెలిచిన సవితకు టికెట్ విషయంలో సీనియర్ నేత పార్ధసారధి నుండి గట్టి పోటీ ఎదురయింది. కానీ అనూహ్యంగా టికెట్ దక్కించుకుని ఏకంగా 33388 ఓట్లతో తొలిసారి గెలిచి బీసీ సంక్షేమం, హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ శాఖా మంత్రి అయిపోయింది. ఇక ధర్మవరం టికెట్ కోసం బీజేపీ నుండి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి నుండి తీవ్ర పోటీ ఎదుర్కొన్నప్పటికీ బీజేపీలో సీనియర్ అయిన సత్యకుమార్ యాదవ్ కు బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఇక్కడ అనూహ్యంగా కేతిరెడ్డి వెంకట్ రామిరెడ్డి మీద 3734 ఓట్లతో విజయం సాదించాడు. ఇంకేముంది కట్ చేస్తే బీజేపీ నుండి గెలిచిన 8 మందిలో సత్యకుమార్ యాదవ్ ఏకంగా ఆరోగ్యశాఖ మంత్రి అయిపోయాడు. ఇక ఉమ్మడి కడప జిల్లా నుండి రాయచోటిలో ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి నాలుగుసార్లు అక్కడ వరసగా గెలిచిన గడికోట శ్రీకాంత్ రెడ్డిని 2495 ఓట్లతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: