36 ఏళ్లకే కేంద్రమంత్రిగా ఎదిగిన రామ్మోహన్ నాయుడు.. ఆయన జర్నీ ఇదే..??

Suma Kallamadi
ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేబినెట్ మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ నుంచి ఇద్దరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో టీడీపీ నేత, శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఒకరు. తాజాగా ఈ నేత చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో భారతీయ చరిత్రలో యంగెస్ట్ యూనియన్ మినిస్టర్‌గా రికార్డు సృష్టించారు. వరుసగా మూడోసారి శ్రీకాకుళం ఎంపీగా గెలిచిన రామ్మోహన్ నాయుడు ఇప్పుడు కేంద్రమంత్రి స్థాయికి ఎదిగి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన పొలిటికల్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం.
కమ్మ సామాజిక వర్గానికి చెందిన రామ్మోహన్ శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు దంపతులకు 1987, డిసెంబర్ 18న జన్మించారు. ఇండియాలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, న్యూయార్క్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. రామ్మోహన్ తండ్రి ఎర్రన్నాయుడు  హెచ్‌డీ దేవెగౌడ, ఐకె గుజ్రాల్ క్యాబినెట్స్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఎర్రన్నాయుడు 25 ఏళ్లకే ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చాలాసార్లు ఎంపీగా కూడా గెలిచారు. 55 ఏళ్ల సమయంలో ఒక కారు యాక్సిడెంట్ తర్వాత ఆయన హార్ట్ ఎటాక్‌తో మరణించారు. రామ్మోహన్ తన తండ్రి మరణం తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేస్తూ వస్తున్నారు. 2014లో 127,576 ఓట్ల తేడాతో ఎంపీగా గెలిచారు. అలా 26 ఏళ్లకే లోక్‌సభ సభ్యుడయ్యి చరిత్ర సృష్టించారు.
రామ్మోహన్ 2017, జూన్‌లో టీడీపీ నేత బండారు సత్యనారాయణ చిన్న కుమార్తె అయిన శ్రావ్యను పెళ్లి చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో 3.27లక్షల ఓట్ల మెజార్టీతో విజయ బావుటా ఎగరవేశారు. చంద్రబాబు ఈ యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్‌కు యూనియన్ మినిస్టర్ అయ్యే ఛాన్స్ ఇచ్చారు. ఈరోజు కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాక శ్రీకాకుళం ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు  రామ్మోహన్ నాయుడు. తాను కేంద్ర మంత్రి కావడానికి శ్రీకాకుళం జిల్లా ప్రజలే కారణమని చెప్పుకొచ్చారు. శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నానని అన్నారు. తండ్రి కింజరాపు ఎర్రన్నాయుడు ఆశీస్సులు ఎల్లప్పుడూ తనకుంటాయని, అందుకే ఈరోజు కేంద్రమంత్రి కాగలిగానని అన్నారు. ఎప్పుడూ గైడెన్స్ ఇస్తూ, ఎంకరేజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడుకి, సోదరుడులాగా వెన్నంటే ఉంటున్న లోకేష్‌కు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నారు. పవన్ కళ్యాణ్, మోదీ బాబాయి అచ్చెన్నాయుడికి కూడా స్పెషల్ గా థాంక్స్ చెప్పుకున్నారు.
మోదీ, చంద్రబాబు నేతృత్వంలో మంత్రిగా పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టం అని చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీలన్నీ శక్తివంచన లేకుండా అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: