చంద్రబాబు కేబినెట్‌లో పవన్‌కు కీలక పదవి.. డిప్యూటీ సీఎంతో పాటు ఆ శాఖ కూడా?

Suma Kallamadi
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన విజయంపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 100 శాతం స్ట్రైక్ రేట్‌తో పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలిచింది. దీంతో జనసేన పార్టీ పేరు మార్మోగిపోతోంది. అధికారంలో ఉన్న వైసీపీని గద్దె దించడంలో పవన్ చాలా స్ట్రాటజిక్‌గా వ్యవహరించారు. 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లకే తగ్గి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడడానికి కృషి చేశారు. ఈ విషయాన్ని బీజేపీ పెద్దలతో పాటు చంద్రబాబు కూడా పలు సందర్భాల్లో చెప్పారు. పవన్ లేకపోతే కూటమి లేదు. కొన్ని చోట్ల రెబల్స్ తిరుగుబాటు చేసినా వారికి సర్ది చెప్పేందుకు యత్నించారు. పొత్తు వల్ల కలిగే లాభాలేంటో వివరించారు. ఒకటి రెండు చోట్ల మినహా నేతలందరినీ ఆయన ఒక్కతాటిపైకి తీసుకొచ్చారు. కొందరు ఆయనను వ్యతిరేకించి ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. అయినా ఆయన చలించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులను కలిపి కూటమి భారీ మెజార్టీతో గెలుపొందేందుకు ప్రధాన భూమిక పోషించారు. ప్రస్తుతం 175 అసెంబ్లీ స్థానాలుండగా, కూటమికి 164 స్థానాల బలం ఉంది. అయితే కొత్తగా ఏర్పడే మంత్రి వర్గంలో పవన్ కళ్యాణ్‌కు కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు పవన్ సభలు పెట్టినప్పుడు అభిమానులంతా సీఎం, సీఎం అని అరిచేవారు. అయితే వాస్తవాలను గ్రహించాలని ఆయన చివరికి అందరికీ సర్ది చెప్పారు. తమ పార్టీని రాష్ట్రంలో బలోపేతం చేయడంతో పాటు అసెంబ్లీలో బలమైన ప్రాతినిథ్యం కావాలని భావించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఏర్పరచి, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనీయ లేదు. దాని ఫలితంగా ప్రస్తుతం కూటమి చరిత్రలో గుర్తుండిపోయే మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రభుత్వంలోనూ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషించే అవకాశం పుష్కలంగా ఉంది. చంద్రబాబు సీఎంగా, పవన్ డిప్యూటీ సీఎంగా పదవులు చేపట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా కొత్త ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలకమైన పంచాయతీ రాజ్ శాఖను పవన్ తీసుకునే వీలుంది. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల మెరుగుతో పాటు గ్రామీణ ప్రజలకు చేరువ అయ్యేందుకు, మంత్రిగా చేపట్టే అభివృద్ధితో తన ఇమేజ్ మరింత పెరిగేందుకు ఇది దోహద పడనుంది. అయితే కొత్త ప్రభుత్వంలో ఒకే ఒక్క డిప్యూటీ సీఎం పదవి ఉంటే బాగుంటుందని, ఆ పదవి పవన్ చేపడితే మరింత ప్రయోజనం ఉంటుందని చర్చ సాగుతోంది. ఏదేమైనా పదవుల అంశం చంద్రబాబు, పవన్ కలిపి చూసుకుంటారని, ఏ పదవి చేపట్టాలనేది పవన్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని జనసేన శ్రేణులు చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: