అప్పుడు పప్పు ఇప్పుడు నిప్పు.. రాటుదేలిన లోకేశ్ కు ఇక రాజకీయాల్లో తిరుగులేదా?

Reddy P Rajasekhar
తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి అవగాహన ఉన్నవాళ్లకు నారా లోకేశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో కూటమి విజయానికి నారా లోకేశ్ చేసిన పాదయాత్ర కూడా ఒక విధంగా కారణమని చాలామంది భావిస్తారు. 2023 సంవత్సరం జనవరి 7న కుప్పంలో లోకేశ్ పాదయాత్రను మొదలుపెట్టి 3132 కిలోమీటర్లు నడిచారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు ఎన్నో ఇబ్బందులు ఎదురైనా ఆయన మాత్రం వాటిని అధిగమించారు.
 
పాదయాత్ర సమయంలో లోకేశ్ నాయకుడిగా రాటుదేలారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబును మించిన మెజారిటీ సొంతం చేసుకుని లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడు అని అనిపించుకున్నారు. ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే సహాయం చేసే విషయంలో సైతం నారా లోకేశ్ ముందువరసలో ఉండేవారు. మంగళగిరిలో 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన లోకేశ్ ఈ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు.
 
ఎక్కడ ఓటమి ఎదురైందో అక్కడే సత్తా చాటి నారా లోకేశ్ ప్రశంసలు అందుకున్నారు. ఓటమి విజయానికి తొలిమెట్టు అని ఆయన మరోసారి ప్రూవ్ చేశారు. పాదయాత్ర చేస్తే అధికారం ఖాయమనే సెంటిమెంట్ లోకేశ్ పాదయాత్రతో మరోసారి ప్రూవ్ అయింది. చాలామంది గతంలో లోకేశ్ పప్పు అని విమర్శలు చేయగా ఆ విమర్శలు చేసిన వాళ్లే ఇప్పుడు ఆయనను నిప్పు అని మెచ్చుకుంటున్నారు.
 
భవిష్యత్తులో లోకేశ్ ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని ఏపీ ప్రజలు ఆకాంక్షిస్తుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. రాష్ట్రంలో వైసీపీ పాలన ఏ మాత్రం ఆశాజనకంగా లేదని ఏపీ ఓటర్లు తీర్పు ఇచ్చేశారు. ఈ తీర్పుతో వైసీపీ సైతం తప్పులను గుర్తించి జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అభివృద్ధి చేయకుండా ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా వృథా అని ఏపీ ఓటర్లు చెప్పకనే చెప్పేశారు. లోకేశ్ కు మంత్రి పదవి దక్కడం ఖాయమని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇక ఏపీ రాజకీయాల్లో లోకేశ్ కు తిరుగులేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: