హైదరాబాద్ కు బై బై: పాలకులకు పట్టని హైదరా"బాధ"..!
• ఉమ్మడి ఆస్తులు పోయినట్టేనా..?
• హైదరాబాదును వీడాలంటే బాధేస్తోంది..
హైదరాబాద్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి గుండెకాయ లాంటి రాజధాని. అలాంటి గుండె కాయ తీసేస్తే పరిస్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి అలాగే తయారైంది. గుండెకాయ లాంటి రాజధాని జూన్ 2న దూరం కాబోతోంది. దీంతో హైదరాబాద్ తో కనెక్ట్ పెట్టుకున్నటువంటి ఎంతోమంది ప్రజలు, వ్యాపారస్తులు ఎమోషనల్ అవుతున్నారు. కొంతమంది తల్లిదండ్రులు రాబోయే రోజుల్లో వారి పిల్లలకు అనగనగా ఒక హైదరాబాదు ఉండేది అక్కడే నువ్వు పుట్టావురా అని చెప్పుకునే పరిస్థితి వస్తోంది. అలాంటి హైదరాబాద్ తో లక్షలాదిమంది పెనవేసుకున్న బంధం తెగిపోతోంది. అలాంటి బంధాన్ని విడిపోవాలంటే ఎవరికైనా కన్నీరు వస్తుంది. కానీ తప్పక వీడాల్సిందే. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయే సమయంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు ఉంటుందని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతలోపు ఏపీలో రాజధాని అభివృద్ధి చేసుకోవాలని తెలియజేసింది. అయినా పట్టని పాలకులు రాజధాని విషయంలో రచ్చ లేపి చెరొక ఐదు సంవత్సరాలు పాలించారు. కానీ రాజధాని మాత్రం పూర్తి చేయలేకపోయారు. అంతేకాదు ఇంకా హైదరాబాదు నుంచి రావాల్సినటువంటి చాలా విషయాల్లో వీరు చేసిన నిర్లక్ష్యం వల్ల జూన్ 2న ఆస్తులన్నీ కోల్పోవలసిన పరిస్థితి ఏర్పడింది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.
కోల్పోతున్న ఆస్తులు:
హైదరాబాదును 2014 నుంచి 2024 జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా కొనసాగాలని అప్పటి కేంద్రం చెప్పింది. వారు చెప్పినట్టుగానే 2014లో చంద్రబాబు గెలిచిన తర్వాత కొన్నాళ్లపాటు హైదరాబాద్ నుంచే పాలన అందించారు. ఎప్పుడైతే ఆయన ఓటుకు నోటు ఆరోపణ ఎదుర్కొన్నారో అప్పటి నుంచి మళ్లీ హుటాహుటిన అమరావతి రాజధాని అని శంకుస్థాపన చేసి ఆంధ్రాకు వచ్చి పడ్డారు. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు.ఆయన కూడా కొన్నాళ్లపాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి పాలన అందించారు. కానీ జగన్ కు నచ్చక ఆ బిల్డింగ్ లన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి పాలన చేశారు. కానీ ఒక లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ని మాత్రం విలేకరుల సమావేశానికి వాడుకుంటూ వచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో 9, 10 షెడ్యూల్స్ చాలా కీలకమైనవి. ఈ షెడ్యూల్ ప్రకారం విభజన జరపాల్సిన శిక్షణ సంస్థలు మరియు కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు వాటి విభజన ఇంతవరకు కూడా పూర్తి చేయలేదు. ఈ విషయాలపై చంద్రబాబు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ దృష్టి పెట్టలేదు. వారి అవసరాలకు తగ్గట్టుగా రాజకీయాలు మాత్రమే చేస్తూ ముందుకు వెళ్లారు తప్ప మనకు అక్కడి నుంచి ఆస్తులు వస్తాయి తీసుకొచ్చుకొని మన దగ్గర డెవలప్ చేసుకోవాలనే ఆలోచన ఏమాత్రం చేయలేదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తొమ్మిదవ షెడ్యూల్లో మొత్తం 89 ప్రభుత్వ కంపెనీలు, సంస్థలు ఉన్నాయి. ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రియల్ కార్పొరేషన్, వేర్ హౌస్ కార్పొరేషన్ ఇంకా మరెన్నో ఉన్నాయి. షెడ్యూల్ 10 లో శిక్షణ సంస్థలు 107 ఉన్నాయి. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఫారెస్ట్ అకాడమీ, ఏపీ పోలీస్ అకాడమీ మరెన్నో ఉన్నాయి. అలాగే తెలంగాణ నుంచి దాదాపు 6700 కోట్ల విద్యుత్ బకాయిలు ఏపీకి రానున్నాయట. కానీ ఏపీ నాయకులు వీటిపై ఏమాత్రం దృష్టి పెట్టకుండా ప్రజలను చాలా మోసం చేశారని చెప్పవచ్చు.
హైదరా"బాధ":
ప్రస్తుతం హైదరాబాదులో ఏపీ నుంచి ఎంతోమంది పొట్టకూటి కోసం వెళ్లి అక్కడే సెటిలై కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు. మరి కొంతమంది యువకులు చదువుకోవడం కోసం వెళ్లి అక్కడే ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అయిపోయారు. ఇలా ఎంతో మంది ఏపీ నుంచి హైదరాబాద్ కు వచ్చి బ్రతుకుని వెళ్లదీసుకుంటున్నారు. ఆ విధంగా హైదరాబాద్ తో ఎంతో కనెక్ట్ అయిన ప్రజల బంధం జూన్ 2తో దూరం కాబోతోంది. దీంతో చాలామంది ఏపీ ప్రజలు కాస్త లోలోపల ఎమోషనల్ అవుతున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ అనేది విశ్వనగరం. ఎవరినైనా హక్కున చేర్చుకుంటుంది కానీ ఇన్నాళ్లు మన హైదరాబాద్ అని చెప్పుకున్న ఆంధ్ర ప్రజలు ఇప్పుడు ఆ విషయాన్ని గట్టిగా చెప్పలేరు. ఆ విధంగా హైదరాబాద్ దూరమవుతుంటే ఆంధ్ర పాలకులు అంటీ ముట్టనట్టు ఉండడం మరో బాధాకరమైన విషయం.