మాచర్లలో పిన్నెల్లికి షాక్ తప్పదా?

Suma Kallamadi
ఏపీలో ఎన్నికలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రత్యర్థులను గౌరవిస్తూ రాజకీయాలు సాగేవి. అయితే ప్రస్తుతం ప్రత్యర్థులను అంతమొందించాలనే ఉద్దేశంతో ఘర్షణలు జరుగుతున్నాయి. ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటూ హింసాత్మక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రాయలసీమ ప్రాంతాల్లో, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఫ్యాక్షన్ ప్రభావం ఉండేది. ప్రస్తుతం అంతకుమించిన వాతావరణం పల్నాడు జిల్లా మాచర్లలో ఉంది. ఎమ్మెల్యేలను సైతం తరిమి కొడుతున్న సందర్భాలు ఇటీవల కాలంలో ఈ జిల్లాలో కనిపించాయి. ముఖ్యంగా మాచర్లలో ఇప్పటి వరకు వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి హవా నడిచింది. 2009లో పిన్నెల్లి రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి ఓటమి అనేది ఎరుగకుండా ముందుకు సాగుతున్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. అనంతరం వైసీపీలో చేరారు. 2012లో వైసీపీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత వరుసగా ఆ పార్టీ నుంచి 2014, 2019లలో విజయం సాధించారు. 2024లో సైతం విజయం తనదే అనే ధీమాలో ఆయన ఉన్నారు. అలాంటి పిన్నెల్లికి 2019 తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి ఖాయమనే ప్రచారం సాగింది. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆయనకు నిరాశ ఎదురైంది. 2024లో ఆయన ఇక్కడ గెలిచి, వైసీపీ రాష్ట్రంలో అధికారం చేపడితే ఖచ్చితంగా ఆయన మంత్రి పదవి చేపట్టే అవకాశాలున్నాయి. ఇలాంటి తరుణంలో నియోజకవర్గంలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి.
మాచర్లలో పిన్నెల్లికి ధీటైన అభ్యర్థి లేరు అని అంతా అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా జూలకంటి రంగారెడ్డిని టీడీపీ ఇక్కడ మోహరించింది. 1999లో ఇక్కడి నుంచి జూలకంటి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వరుసగా 2004, 2009లో ఆయన పరాజయం పాలయ్యారు. దీంతో రాజకీయంగా ఆయన సైలెంట్ అయ్యారు. నిధుల లేమి కూడా ఒక కారణం. అయితే మాచర్లలో ఎలాగైనా గెలవాలని భావించిన చంద్రబాబు ఇక్కడి నుంచి జూలకంటిని పార్టీ ఇన్‌‌చార్జిగా ప్రకటించారు. దీంతో టీడీపీ శ్రేణులకు కొత్త ఉత్సాహం వచ్చినట్లైంది. అదే సమయంలో నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంతగా అల్లర్లు జరిగాయి. టీడీపీ కార్యకర్తలను వైసీపీ వారు హత్యలు చేయడం కూడా అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని వైసీపీ ఆరోపించడం, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి ఒకడుగు ముందుకు వేసి ఏకంగా ఈవీఎం బద్దలు గొట్టడం జరిగాయి. దీంతో ఆయన అరెస్టుకు ఈసీ ఆదేశాలు ఇవ్వడం, పరారీలో ఉన్న పిన్నెల్లి చివరికి హైకోర్టును ఆశ్రయించి మధ్యంతర బెయిల్ పొందడం వంటివి జరిగాయి. ఓ వైపు నియోజకవర్గంలో పట్టు సడలడంతో పాటు ఈవీఎం పగులగొట్టిన కేసు పిన్నెల్లిని వెంటాడుతున్నాయి. దీంతో మంత్రి కావాల్సిన వ్యక్తి పరిస్థితి రాజకీయంగా అగమ్యగోచరంగా మారింది. ఇక్కడ టీడీపీ అభ్యర్థి జూలకంటి రంగారెడ్డికే ఎడ్జ్ ఉందని పలు సర్వేలు వెల్లడించాయి. అయితే అసలు ఫలితం మరికొన్ని రోజుల్లోనే తేలనుండడంతో దీని కోసం అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: