ఆందోళనలో టీడీపీ.. దెబ్బతీస్తున్న అతి విశ్వాసం?

Purushottham Vinay
కడప, రాజంపేట పార్లమెంట్‌ స్థానాల్లో వైసీపీ ఆధిపత్యం ఎక్కువ. ఎన్నికలు ఏవైనా కానీ ఏకపక్షంగా ఫలితాలు ఉండేవి. ఇప్పటికీ వైఎస్సార్‌సీపీకి ప్రజానీకం అండగా ఉన్నప్పటికీ ఈసారి కొన్ని ప్రాంతాల్లో కాస్త తేడా కన్పించింది. అందుకు కారణంగా ఆయా నేతల వ్యక్తిగత వ్యవహారశైలి, మరోవైపు టీడీపీ అభ్యర్థులు వరుసగా ఓడిపోతున్న నేపథ్యం, సామాజిక సమీకరణలు ఇలాంటి కారణాల రీత్యా కాస్త అనుకూల పవనాలు వీచాయి. కాగా, టీడీపీ అభ్యర్థులు ఒక్కో ఇటుకని పేర్చుకుంటూ రావాల్సి ఉండగా, తిరోగమనంలో ఉన్న అవకాశాన్ని చేజార్చుకుంటూ వచ్చారని రాజకీయ విశ్లేషకులు తెలుపుతున్నారు.కడప అసెంబ్లీ పరిధిలో అయితే ఎప్పుడూ లేనివిధంగా విద్వేషాలు తెరపైకి వచ్చాయి. ప్రశాంత వాతావరణంలో జీవిస్తున్న ప్రజానీకం మధ్యలో కలతలు క్రియేట్ చేశారు. ఎన్నికల కోసం హిందూ-ముస్లిం అనే ఫీలింగ్‌ తీసుకొచ్చారు. ఎలాగైనా గెలుస్తామన్నా అతి ధీమా టీడీపీ శిబిరంలోకి వచ్చి చేరింది. ఈ పరిస్థితుల్లో టీడీపీ టికెట్‌ ఆశించిన కార్పొరేటర్‌ ఉమాదేవి కుటుంబ సపోర్ట్ ని స్వీకరించడంలో విఫలమయ్యారు. ఇంకా మరోవైపు శాంతికి నిలయమైన కడపలో దుందుడుకు చర్యలను కొనసాగిస్తూ వచ్చారు.


ఇప్పుడే ఇలా ఉంటే, ఎమ్మెల్యేగా ఎన్నికైతే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న అంచనాకు తటస్తులు రావడం జరిగింది. అదే టీడీపీకి శాపంగా మారిందని తెలుస్తుంది. పదేళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగు తున్న అంజద్‌బాషా మంచితనాన్ని గమనించిన ప్రజలు పోలింగ్‌లో ఆ ప్రభావం చూపారని పలువురు వివరిస్తున్నారు. ఇటువంటి స్థితి కమలాపురంలో కూడా తెరపైకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.అయినా కానీ స్థానికంగా ఆయన మద్దతు కోరలేదు, స్వగ్రామం కోగటంలో ప్రచారానికి వెళ్తూ, అసలు సమాచారం కూడా ఇవ్వలేదు. పైగా అవసరం లేదన్నట్లుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుత్తా కుటుంబం వ్యవహరించింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేత సాయినాథశర్మతో ఎన్నికలు సమీపించే కొద్ది గొడవలు పెట్టుకొని దూరం చేసుకున్నారు. ఈ ఇద్దరు నేతలను దూరం చేసుకోవడం తెలుగుదేశం పార్టీకి ప్రతిబంధకంగా మారిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో భారీ మెజార్టీ దక్కుతుందని భావిస్తున్న కమలాపురం మండలంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని స్థాయిలో లోటు ఏర్పడిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: