ఏపీ: వైసీపీ, టీడీపీ మైండ్ గేమ్ ప్రజలు పట్టించుకోవట్లేదా?

Suma Kallamadi
జూన్ 4వ తేదీన వెలువడే ఎన్నికల ఫలితాల కోసం యావత్ ఆంధ్ర ప్రదేశ్ చాలా ఉత్కంఠతగా ఎదురు చూస్తోంది. అవును, ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడొక లెక్క. లెక్క తప్పదని వైసీపీ పార్టీ ధీమాని వ్యక్తం చేస్తే, ఈ సారి లెక్క రివర్స్ అవుతుందని టీడీపీ నాయకులు నొక్కి చెబుతున్నారు. ఇంకేముంది కట్ చేస్తే సోషల్ మీడియా పుణ్యమాని రోజుకొక కొత్త ఫిగర్స్ వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఏది ఎలాగున్నా సగటు ఓటర్ మాత్రం ఒకప్పటిలా కాదు. కాసింత క్లారిటీని కలిగి వున్నాడిపుడు అనడంలో అతిశయోక్తి లేదు. దానికి కారణం కూడా సోషల్ మీడియానే అని చెప్పుకోవచ్చు.
ఎందుకంటే, ఇక్కడ సదరు సో కాల్డ్ రాజకీయ నాయకులు తమ గురించి చెప్పేలోపే ఓటర్ అనేవాడు ఓ పది పద్నాలుగు సర్వేలను చూసేస్తున్నాడు. అవును, ఒక రాజకీయ పార్టీ ఒక మాట చెబితే అది నమ్మే పరిస్థితుల్లో ఇపుడు ఎవరూ లేరు. కాలం మారుతోంది. సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈసారి 151 ఎమ్మెల్యేల కంటే ఎక్కువగా అలాగే 22 ఎంపీల కంటే ఎక్కువగా సీట్లు గెలవబోతున్నాం అని భారీ స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ ఆ పార్టీ నేతల్లో ఆ స్థాయి జోష్ కనబడడం లేదనేది నిర్వివాదాంశం. ఒకప్పుడు బెబ్బులి పులుల్లా గాండ్రించిన నాయకులు ఇపుడు డౌన్ టు ఎర్త్ మాట్లాడడం సగటు ఓటర్ చాలా స్పష్టంగా గమనిస్తున్నాడు. అంతెందుకు ఫైర్ బ్రాండ్ గా ముద్రపడిన కీలక నేతలు సైతం మౌనం పాటిస్తూ ఉండడంతో ముఖ్యమంత్రి చెప్పినది మైండ్ గేమ్ కోసమా అన్న చర్చ కూడా సోషల్ మీడియాలో వాడివేడిగా జరుగుతోంది.
మరోవైపు టీడీపీ పరిస్థితి కూడా అదే మాదిరి ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు పోలింగ్ జరిగిన రోజే మేము గెలుస్తున్నాం అని ధీమా వ్యక్తం చేసిన సంగతి విదితమే. దీనిని టీడీపీ శిబిరం కాదు కదా, సామాన్య ఓటర్ కూడా నమ్మే పరిస్థితుల్లో లేనట్టు కనబడుతోంది. ఒకరికి ఒకరు పోటీగా అలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు తప్పితే గ్రౌండ్ రియాలిటీ అలా ఉందా? అన్నదే ఇపుడు సగటు ఓటర్ కి వస్తున్న సందేహం! మరోవైపు జనసేన ఉండనే ఉంది. తాము ఈ సారి ఖచ్చితంగా డబుల్ డిజిట్ గెలుస్తామని చెబుతోంది. ఇక్కడ కూడా సేమ్ డౌట్. జనసేన పార్టీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నా క్షేత్ర స్థాయిలో ఎంతవరకూ పరిస్థితులు సహకరించాయి అనేది మీమాంసగానే మిగిపోతుంది. మొత్తానికి ఇటువంటి మైండ్ గేమ్ ని వాడుకొని గతంలో అద్భుతమైన ఆయుధంగా ప్రయోగించి ప్రత్యర్ధులను నిర్వీర్యం చేసేవారు. కానీ సోషల్ మీడియా పుణ్యమాని ఇలాంటి ప్రయోగాలకు కాలం చెల్లిందనే అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: