నంద్యాలలో ఆ అభ్యర్థిని వణికిస్తున్న క్రాస్ ఓటింగ్.. గెలుపు సులువు కాదా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమి తరపున బైరెడ్డి శబరి పోటీ చేయగా వైసీపీ నుంచి పోచ బ్రహ్మానందరెడ్డి పోటీ చేశారు. అయితే పోచ బ్రహ్మానందరెడ్డిని క్రాస్ ఓటింగ్ భయపెడుతోందని తెలుస్తోంది. కొంతమంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరికి స్వచ్చందంగా అండగా నిలిచినట్లు సమాచారం అందుతోంది. బైరెడ్డి శబరి సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూతురు అనే సంగతి తెలిసిందే.
 
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బంధుత్వం ఉండటంతో పలువురు వైసీపీ నేతలు బైరెడ్డి శబరి వెంట నడిచారని సమాచారం అందుతోంది. నంద్యాల పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఈ ఎన్నికల్లో ఏకంగా 13 లక్షల 87 వేల 367 ఓట్లు పోల్ కావడం జరిగింది. ఈ ఓట్లలో మెజారిటీ ఓట్లు పాణ్యం నియోజకవర్గం నుంచి పోల్ కావడం గమనార్హం.
 
కర్నూల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 11 వార్డులు సైతం నంద్యాల జిల్లా పరిధిలోకి వస్తాయి. ఇక్కడ స్థిరపడ్డ వాళ్లు బైరెడ్డి శబరికి మద్దతు ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. నందికొట్కూరు, ఓర్వకల్లులో నివశించే వాళ్లలో చాలామంది బైరెడ్డి శబరికి ఓటు వేశారని భోగట్టా. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి రైతు వర్గంతో సంబంధాలు ఉండగా ఆ రైతు వర్గం కూడా బైరెడ్డి కుటుంబానికి అండగా నిలిచినట్లు తెలుస్తోంది.
 
బైరెడ్డి శబరి వైద్యురాలు కావడంతో అర్బన్ ఓటర్లు సైతం ఆమెకు అండగా నిలిచినట్లు సమాచారం. అయితే వైసీపీ నేతలు మాత్రం పోచ బ్రహ్మానందరెడ్డికి మెజారిటీ తగ్గొచ్చేమో కానీ గెలుపు మాత్రం పక్కా అని చెబుతున్నారు. నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గంలో నిజంగానే క్రాస్ ఓటింగ్ జరిగిందో లేదో తెలియాలంటే మాత్రం ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. నంద్యాల పార్లమెంట్ ఎన్నికల ఫలితం ఏ రాజకీయ పార్టీకి ఫేవర్ గా వస్తుందో చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: