జై జగన్ రెడ్డి కాదు.. జై జగన్ యాదవ్..?
- ఈ సారి 2 ఎంపీ, 4 ఎమ్మెల్యే టిక్కెట్లు
- మైలవరం, కనిగిరిలో కార్యకర్తలకు ఎమ్మెల్యే టిక్కెట్లు
( ప్రకాశం - ఇండియా హెరాల్డ్ )
ఏపీలో ఈ సారి ఎన్నికల్లో బీసీల ఓట్లు ఎవరికి వారు ఎటు వైపు ఓట్లు వేస్తే వారిదే అధికారం అన్న చర్చలు నడుస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలు జగన్ వైపు ఉంటే.. అగ్ర కులాల్లో రెడ్లు మినహా మిగిలిన వారందరూ కూడా కూటమి వైపే ఉన్నారన్న చర్చలు ఎక్కువుగా నడుస్తున్నాయి. అంటే ఆ కులాల్లో అందరూ.. నూటికి నూరు శాతం ఒకే పార్టీకి ఓట్లు వేస్తారని చెప్పలేం కాని.. మెజార్టీ వేస్తారన్నదే ఇక్కడ అంచనాలు.. లెక్కలు నడుస్తుంటాయి.
అయితే బీసీల్లో బలమైన యాదవ్ సామాజిక వర్గం ఈ సారి ఎటు వైపు మొగ్గు చూపుతుందన్నదే ఆసక్తి గా మారింది. యాదవ్ సామాజిక వర్గం ఓటర్లు ఏపీ మొత్తం మీద 6.5 - 7 వరకు ఉంటారు. అయితే 2019 నుంచి ఈ సామాజిక వర్గం ఓటర్లపై జగన్ బాగా దృష్టి పెడుతూ వచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో జగన్ ఏకంగా రెండు పార్లమెంటు స్థానాల్లో యాదవ్ వర్గానికి ఇచ్చారు. ఎప్పుడూ ఓసీలకే ఇచ్చే నరసారావుపేట పార్లమెంటు సీటును మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్‌కు ఇచ్చారు.
ఇక ఏలూరు పార్లమెంటు సీటును కూడా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు కారుమూరి సునీల్‌కుమార్‌కు ఇచ్చారు. ఇక అసెంబ్లీ సీట్లలో మైలవరంలో సాధారణ జడ్పీటీసీగా ఉన్న సర్నాల తిరుపతిరావు యాదవ్‌కు, కనిగిరిలో హనుమంతునిపాడు జడ్పీటీసీ దద్దాల నారాయణరావు యాదవ్‌కు సీటు ఇచ్చారు. తణుకులో కారుమూరి నాగేశ్వరరావు, కందుకూరులో ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఇక కూటమి నుంచి మొత్తం 9 మందికి సీట్లు దక్కాయి.
విశాఖ సౌత్‌లో జనసేన నుంచి వంశీకృష్ణయాదవ్, గాజువాకలో టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్, తునిలో టీడీపీ నుంచి యనమల దివ్య, ఏలూరు పార్లమెంటులో టీడీపీ నుంచి పుట్టా మహేష్ యాదవ్, నూజివీడు నుంచి టీడీపీ తరపున పార్థసారథి, మైదుకూరులో టీడీపీ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్, ధర్మవరంలో బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఏదేమైనా ఓవరాల్‌గా మాత్రం ఈ సారి యాదవ్ కమ్యూనిటీలో మెజార్టీ ఓటర్లు వైసీపీ వైపే ఉన్నట్టు క్లీయర్‌గా తెలుస్తోంది. తమకు రాజకీయ ప్రధాన్యత పెంచిన జగన్‌ను తమ వాడిగా వీరు ఓన్ చేసుకుంటుండడం చాలా చోట్ల కనిపిస్తోంది.