' పెద్దిరెడ్డి ' కంట్లో నలుసు.. కారం కూడా.. పుంగ‌నూరులో ముప్పేట ఇరుక్కుపోయారే..?

RAMAKRISHNA S.S.
అనుకున్న విధంగా ఎన్నిక‌లు జ‌రిగిపోయే ప‌రిస్థితి లేదు. 2014, 2019 వంటి ప‌రిస్థితిలు కూడా లేవు. అడుగు వేస్తే.. ప్ర‌తిపక్షం.. అడుగు తీస్తే ప్ర‌తిప‌క్షం.. అన్న‌ట్టుగా మారిపోయింది.. కీల‌క నియోజ‌క‌వ‌ర్గం పుంగ‌నూరు ప‌రిస్థితి. కోరి తెచ్చుకున్న కుంప‌ట్లు.. ఇక్క‌డ మంత్రి, వైసీపీ అగ్ర‌నేత పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి సెగ‌లు పుట్టిస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓట్లు చీలాయి.. బ‌య‌ట ప‌డ్డాయి. టీడీపీ, జ‌న‌సేన‌, వైసీపీ విడివిడిగా పోటీ చేశాయి. దీంతో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకున్నారు.

కానీ, ఇప్పుడు.. అలా లేదు. కూట‌మి పార్టీలు జ‌త‌క‌ట్టాయి. బీజేపీ, జ‌న‌సేన‌లు.. కూట‌మి అభ్య‌ర్థి, టీడీపీ నేత‌.. చ‌ల్లా రామ‌చంద్రారెడ్డికి జైకొట్టాయి. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేశాయి. పోనీ. వీటిదేముందిలే.. అని లైట్ తీసుకుందామని అనుకుంటే.. పెద్దిరెడ్డి ఓట‌మిని చూడందే.. నేను క‌ద‌ల‌ను అన్న‌ట్టుగా.. ఇక్క‌డ మాజీ సీఎం న‌ల్లారి కిర‌ణ్‌కుమార్‌రెడ్డి.. ఉద‌యం సాయంత్రం.. పుంగ‌నూరులోనే ద‌ర్శ‌న‌మిస్తున్నారు. రాజంపేట నియోజ‌క‌వ‌ర్గంనుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆయ‌న‌కు బ‌లం ఎక్కువ‌గానే ఉంది.

ఇక‌, బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాద‌వ్‌.. త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. యువ‌త‌ను ఆక‌ర్షిస్తున్నారు. యువ‌త‌ను త‌న‌వైపు తిప్పుకొన్నారు. బీసీల‌నుముఖ్యంగా యాద‌వుల‌ను త‌న వెంటే ఉంచుకున్నారు. పెద్దిరెడ్డి అక్ర‌మాలు ఇవీ.. అంటూ ప్ర‌చారాన్ని జోరెత్తిస్తున్నారు. ఇది పెద్దిరెడ్డి కంట్లో న‌లుసుగా మారింది. కిర‌ణ్‌కుమార్‌రెడ్డి ఏకంగా.. గ‌త కాల‌పు.. అంశాల‌ను జోడించి చేస్తున్న వ్యాఖ్య‌లు.. ప్ర‌చారం.. కారానే చ‌ల్లుతున్నాయి. వెర‌సి.. పెద్దిరెడ్డి త‌ల‌కు మించిన పోటీని ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు పెద్దిరెడ్డి అరాచ‌కాల‌పై పోరాటం చేసేందుకు ఢిల్లీ వెళ్లి మ‌రీ త‌న బ‌లం ఏంటో చూపించుకుని ఇక్క‌డ పోలీసు అధికారుల‌ను ట్రాన్స్‌ఫ‌ర్ చేయించ‌డం రామ‌చంద్ర యాద‌వ్ స‌త్తాకు, ఆయ‌న బ‌లానికి నిద‌ర్శ‌నం.

మ‌రోవైపు.. టీడీపీ త‌ర‌ఫున ఉన్న చ‌ల్లా రామచంద్రారెడ్డి.. రెడ్డి వ‌ర్గాన్ని కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉన్నారు. ఇక్క‌డ రెడ్డి సామాజిక వ‌ర్గం గ‌త ఐదేళ్లుగా ఎలాంటి ప‌నులు లేకుండా గోళ్లు గిల్లుకునే ప‌రిస్థితి వ‌చ్చింది. త‌న కుటుంబానికి.. త‌న వారికి మాత్ర‌మే కాంట్రాక్టులు ద‌క్కేలా.. పెద్దిరెడ్డి చ‌క్రం తిప్పారు. ఈ ప‌రిణామం.. రెడ్డి వ‌ర్గంలో స‌హ‌జంగానే కోపాన్ని పెంచింది. దీనికి చ‌ల్లా మ‌రింత ఆజ్యం పోస్తున్నారు. ఇది.. రుగులుతోంది. ఎన్నిక‌ల స‌మ‌యం కోసం ఎదురు చూస్తోంది. వెర‌సి.. పెద్ది రెడ్డి ప‌రిస్థితి పైన చెప్పుకొన్న‌ట్టు కంట్లోన‌లుసు.. కారంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: