సీఎం జగన్ నోరు విప్పు.. నీ చెల్లెళ్ల ప్రశ్నలకు సమాధానం చెప్పు: వివేకా సతీమణి బహిరంగ లేఖ

Suma Kallamadi
ఏపీ సీఎం వైఎస్ జగన్ గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. పులివెందులలో ఆయన బహిరంగ సభ నిర్వహించారు. ఈ తరుణంలో జగన్‌కు వైఎస్ వివేకానంద రెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ విడుదల చేశారు. సీఎంను ప్రశ్నిస్తూ సంచలన విమర్శలు చేశారు. ఈ లేఖ ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. 2019లో హత్యకు గురైన వివేకా హత్య కేసును ఇప్పటి వరకు ఎందుకు పరిష్కరించలేదని ఆమె నిలదీశారు. జగన్ మోహన్ రెడ్డి తన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పుడు పడ్డ బాధనే 2019 నుంచి తన కూతురు సునీత పడుతున్నదని సౌభాగ్య తన లేఖలో గుర్తు చేశారు. కడప లోక్‌సభ స్థానానికి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా జగన్‌మోహన్‌రెడ్డి తన బంధువు, సిట్టింగ్‌ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి పేరును మళ్లీ ప్రతిపాదించడాన్ని విమర్శించారు. గతేడాది వివేకానందరెడ్డి హత్య కేసులో అవినాష్‌ను ఎనిమిదో నిందితుడిగా సీబీఐ పేర్కొందని గుర్తు చేశారు.

సౌభాగ్య తన వేదనను వ్యక్తం చేస్తూ, "నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాడు వైఎస్ వివేకానంద రెడ్డి. కానీ మీ స్వంత వార్తాపత్రిక, న్యూస్ ఛానెల్, సోషల్ మీడియాలో మీ మద్దతుదారులు అతని ప్రతిష్టను దిగజార్చుతున్నారు. దీనిని మీరు సమర్థిస్తున్నారా?" అని ప్రశ్నించారు. “మీ సోదరి సునీత, మరో సోదరి వైఎస్ షర్మిల పక్షాన నిలబడినందుకు ప్రతిరోజూ మీ మద్దతుదారులు హేళన చేస్తున్నారు. మానసికంగా హింసిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ మౌనం భయంకరంగా ఉంది. కుటుంబ సభ్యుడిగా కాకపోతే, ముఖ్యమంత్రిగా అవసరమైన చర్యలు తీసుకోవడం మీ బాధ్యత కాదా? "ఇప్పుడు మీ చిన్నాన్న హత్యలో ప్రమేయం ఉన్న వ్యక్తి తన నామినేషన్ పత్రాలను దాఖలు చేసినందున, చివరి ప్రయత్నంగా నేను మీకు లేఖ రాన్నాను. మీరు చట్టం, న్యాయం కోసం నిలబడాలని నేను ప్రార్థిస్తున్నాను" అని ఆమె రాసింది. కడప నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేయగా, సునీతారెడ్డి ఆమెకు మద్దతుగా నిలిచారు. హత్యా నిందితులను రక్షించడం, హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఇద్దరూ జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికలకు వారాల ముందు అంటే మార్చి 15, 2019న పులివెందులలోని తన నివాసంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, జగన్ మోహన్ రెడ్డి మామ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యారు. ఇప్పటికీ ఆ కేసు తేలలేదు. ఆశ్చర్యకరంగా సీఎం జగన్ ఈ కేసును పట్టించుకోలేదనే విమర్శలొస్తున్నాయి. కీలకమైన ఎన్నికల సమయంలో సౌభాగ్యమ్మ రాసిన లేఖ ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: