విశాఖ: మహానగరంగా మారిన ఆ పల్లె.. టీడీపీ కంచుకోట?

Purushottham Vinay
విశాఖ: ఒకప్పటి బెస్తవారి పల్లె నేడు మహా నగరంగా విస్తరించింది. పలు రంగాల్లో ప్రగతి పయనాన్ని ఆ పల్లె కొనసాగిస్తోంది. విద్య, వైద్యం, పర్యాటక, పారిశ్రామిక రంగాలతో పాటు జనాభా రీత్యా, రాజకీయంగా పలు మార్పులకు విశాఖ ఎంతగానో ప్రభావితమయింది. 1952 వ సంవత్సరంలో జరిగిన తొలి శాసనసభ ఎన్నికల నాటికే విశాఖపట్నం మంచి నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. ఆ ఎన్నికల్లో కిసాన్‌ మజ్దూర్‌ ప్రజా పార్టీ తరఫున పోటీచేసిన తెన్నేటి విశ్వనాథం గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టిన మొదటి వ్యక్తిగా నిలిచారు. 1952 వ సంవత్సరం అక్టోబరులో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు కేబినెట్‌లో తెన్నేటి విశ్వనాథం ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1953 వ సంవత్సరంలో విశాఖ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో ప్రజా సోషలిస్టు పార్టీ తరఫున తిరిగి తెన్నేటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1955 వ సంవత్సరంలో మధ్యంతర ఎన్నికల్లో ఏవీబీ రావు, కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి ఎన్నికయ్యారు. 1962 వ సంవత్సరంలో కూడా ఇదే పార్టీ నుంచి ఆయన మళ్లీ విజయం సాధించారు. 1967 వ సంవత్సరం ఎన్నికల నుంచి విశాఖ రెండు శాసనసభ నియోజకవర్గాలుగా ఏర్పడింది. 2004 వ సంవత్సరం ఎన్నికల దాకా విశాఖ 1, విశాఖ 2 ఉండగా, దేశవ్యాప్తంగా జరిగిన డీలిమిటేషన్‌ కారణంగా 2009 వ సంవత్సరం సాధారణ ఎన్నికల నాటికి విశాఖ నగరం మొత్తం ఐదు శాసనసభ నియోజకవర్గాలుగా రూపాంతరం చెందింది. విశాఖ 1, 2లను రద్దు చేసి వాటి స్థానంలో విశాఖ దక్షిణ, తూర్పు నియోజకవర్గాలనేవి ఏర్పడ్డాయి.


విశాఖ తూర్పు స్థానానికి జరిగిన మొదటి శాసనసభ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన వెలగపూడి రామకృష్ణబాబు 44,233 ఓట్లు సాధించారు. ఆ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 2,02,447 మంది కాగా, మొత్తం 1,38,104 ఓట్లు పోలయ్యాయి. వెలగపూడి రామకృష్ణబాబు తన దగ్గరి ప్రత్యర్థి ప్రజారాజ్యం అభ్యర్థి చెన్నుబోయిన శ్రీనివాస్‌పై 4,031 ఓట్లు ఆధిక్యత సాధించారు. రెండోసారి 2014 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో వెలగపూడికి 1,00,624 ఓట్లు లభించాయి. సమీప వైసీపీ అభ్యర్థి చెన్నుబోయిన శ్రీనివాస్‌పై 47,883 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మూడోసారి తూర్పులో జరిగిన 2019 వ సంవత్సరం ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలి విచినా, విశాఖ తూర్పులో మాత్రం టీడీపీ హ్యాట్రిక్‌ విజయం సాధించి, వెలగపూడి మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీకి రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 23 సీట్లు రాగా అందులో తూర్పు ఒకటి కావడం విశేషం. ముఖ్యమైన విషయం ఏమిటంటే అంతటి వైసీపీ గాలిలో కూడా ఏకంగా 76,504 ఓట్లు సాధించి, సమీప అభ్యర్థి అక్కరమాని విజయనిర్మలపై 23,635 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక ఈ స్థానం నుంచి 2009 వ సంవత్సరంలో కాంగ్రెస్‌ పార్టీ మూడో స్థానానికి పరిమితం కాగా, 2014, 2019లో కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేదు. రాష్ట్ర విభజన ఆ పార్టీపై చాలా తీవ్ర ప్రభావం చూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: