తెలంగాణ కాంగ్రెస్‌లో పెద్ద చిచ్చు రేగింది... ఆ లీడ‌ర్ ఎవ‌రు.. ఆ క‌దేంది..?

RAMAKRISHNA S.S.
మోత్కుప‌ల్లి న‌ర్సింహులు.. ఈపేరుకు ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు.. ఎందుకంటే ఉమ్మ‌డి ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో మంత్రిగా ప‌నిచేసిన వ్య‌క్తి. అన్ని రాజ‌కీయ పార్టీల్లో చేరి, పార్టీ నేత‌ల‌పైనే విమ‌ర్శ‌లు చేసే నాయ‌కుడు. అలాంటి మోత్కుప‌ల్లి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాదిగ‌ల‌కు అన్యాయం జ‌రుగుతుంద‌ని పోరు చేస్తున్న నేత‌. అందుకే ఇత‌గాడిని అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌లు గుర్తుప‌డ‌తారు. మోత్కుప‌ల్లి గురించి తెలియ‌నివారుండ‌రంటే అతిశ‌యోక్తి కాదు.. ఇప్పుడు ఆయ‌న రాజ‌కీయ చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చాడు క‌నుక ఆయ‌న గురించి నాలుగు ముచ్చ‌ట్లు తెలుసుకుందాం. 1983లో తొలిసారి ఆలేరు శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి సల్లూరు పోశయ్యపై గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

మోత్కుపల్లి నర్సింహులు 1985లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో  చేరాడు. 1985లో ఆలేరు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీచేసి, కాంగ్రెస్ అభ్యర్థి చెట్టుపల్లి కెన్నెడీపై గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఎన్టీఆర్ గారి మూడోసారి మంత్రివ‌ర్గంలో టూరిజం శాఖమంత్రిగా ప‌నిచేశారు.  న‌ర్సింహులు 1991లో నంద్యాల లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పీవీ నరసింహారావు పై పోటీచేసి ఓడిపోయాడు.  2018, మే 28న తెలుగుదేశం పార్టీ నుండి మోత్కుపల్లిని బహిష్కరించారు చంద్ర‌బాబు నాయుడు.

మోత్కుప‌ల్లి వ్య‌వ‌హ‌రశైలితో విసుగెత్తిన చంద్ర‌బాబు నాయుడు మోత్కుప‌ల్లిని పార్టీని నుంచి బ‌హిష్క‌రించ‌డంతో రాజ‌కీయ ప‌త‌నం ప్రారంభ‌మైంద‌నే చెప్ప‌వ‌చ్చు. టీడీపీ బ‌హిష్క‌రించ‌గానే 2019లో  మోత్కుప‌ల్లి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీలోను అస‌మ్మ‌తి రాగం వినిపించ‌డం, నాయ‌కుల‌తో స‌ఖ్య‌త లేక‌పోవ‌డం 2021లో పార్టీకి రాజీనామా చేశారు. కేవ‌లం ఆ పార్టీతో రెండేళ్లు కాపురం చేసిన మోత్కుప‌ల్లి అక్క‌డి నుంచి కేసీఆర్ పంచ‌న చేరాడు. టీ ఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌తో ఉన్న స‌న్నిహిత సంబంధాలు, పూర్వ‌శ్ర‌మంలో ఒకే పార్టీలో ఒకే గొడుగు కింద ప‌నిచేసినవారు కావ‌డంతో కేసీఆర్ మోత్కుప‌ల్లిని చేర‌దీశాడు.

మోత్కుప‌ల్లిని చేర‌దీసిన పాపానికి కేసీఆర్ పైనే విమ‌ర్శ‌లు చేయ‌డం, పార్టీ నాయ‌క‌త్వంపై అసంతృప్తి వెళ్ళ‌గ‌క్క‌డంతో పొమ్మ‌న‌లేక పొగ‌బెట్టిన మాదిరిగా మోత్కుప‌ల్లిని పార్టీ కార్యక్ర‌మాల‌కు దూరంగా ఉంచారు. రాజ్య‌స‌భ‌, ఎమ్మెల్సీ ఆశించినా కేసీఆర్ మోత్కుప‌ల్లి వ్య‌వ‌హ‌రశైలి న‌చ్చ‌క‌ అత‌డికి ఏ ప‌ద‌వి కూడా ఇవ్వ‌కుండానే దూరం పెట్టాడు. దీంతో మోత్కుప‌ల్లికి ఏమి చేయాలో పాలుపోక బీ ఆర్ ఎస్‌కు రాజీనామా చేశారు. ఇక మోత్కుప‌ల్లికి మిగిలింది ఒకే పార్టీ.. అది కాంగ్రెస్ పార్టీ.. ఏమీ చేయాలో తెలియ‌క 2023 అక్టోబ‌ర్‌లో ఏఐసీసీ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక అప్ప‌టి నుంచి ఇప్ప‌టి దాకా కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగుతున్న మోత్కుప‌ల్లి పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటూనే వ‌స్తున్నారు. పార్టీలో ప్రాధాన్య‌త లేక‌పోవ‌డంతో ఏమి చేసేది లేక.. ఏమి చేయాలో పాలుపోక ఇప్పుడు పార్టీ నాయ‌క‌త్వంపై నేరుగా పోరుకు సిద్ద‌మ‌య్యారు.

ఇప్పుడు మాదిగ నేత‌ల‌కు కాంగ్రెస్‌లో టికెట్లు ఇవ్వ‌డం లేద‌ని, కేవ‌లం మాల సామాజిక వ‌ర్గ నేత‌ల‌కే టికెట్లు ఇస్తున్నార‌ని కొత్త ప‌ల్ల‌వి ఎత్తుకున్నాడు. కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి క‌డియం శ్రీహ‌రి అస‌లు మాదిగ కాద‌ని, ఒకే కుటుంబంలో ఇద్ద‌రు, ముగ్గురికి టికెట్లు ఇవ్వ‌డం ఏంట‌ని పార్టీ నాయ‌క‌త్వాన్ని ప్ర‌శ్నిస్తున్నాడు. నాకు కాంగ్రెస్ తీవ్ర అన్యాయం చేసింద‌ని, మాదిగ‌ల‌కు ఇంకా అన్యాయం చేసింద‌ని మాదిగ ఉద్య‌మ నేత‌గా తెగ బిల్డ‌ప్ ఇస్తూ ఒక‌రోజు పోరు చేసి ఊసురుమ‌న్నాడు. మాదిగ‌ల‌కు కాంగ్రెస్ అన్యాయం చేసింది.. పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో మాదిగ‌లంతా త‌మ స‌త్తా చూపెడ‌తార‌ని పిల్లి కూత‌లు కూస్తున్నాడ‌ని మాదిగ జాతి అంటుంది.. ఏదేమైనా ఆరుసార్లు ఎమ్మెల్యే అయితేంది.. కాసింత రాజ‌కీయ జ్ఞానం లేకుంటే చేసేదేమి లేదు క‌దా.. పాపం మోత్కుప‌ల్లి.. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఆయ‌న ప‌రిస్థితి కుడితిలో ప‌డ్డ ఎలుక చందంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: