ఏపీ పాలిటిక్స్: కార్యకర్త ఆలోచించు..!

Pandrala Sravanthi
ఈ పార్టీ గెలిచిన ఏమున్నది గర్వ కారణం.. నాయకుల ఆస్తులు పెరగడమే ప్రథమ ద్యేయం అన్నట్టు తయారయింది ప్రస్తుత రాజకీయ నాయకుల పరిస్థితి. ఇన్ని ఏళ్ల రాజకీయ వ్యవస్థలో  ఓట్లేసిన ప్రజలు  కష్టపడి పని చేసుకుని మూడు పూటలా అన్నం తింటున్నారు తప్ప  రాజకీయ నాయకుల వల్ల ఏమాత్రం బాగుపడలేదు అనేది మాత్రం జగమెరిగిన సత్యం. పార్టీలు ఎన్ని అయినా ఉండొచ్చు.. నాయకులు ఎంత మంది అయినా రావచ్చు..  కానీ వీరందరినీ ఆదరించేది కార్యకర్తలు మాత్రమే. జెండా మోసేది కార్యకర్త.. దండ వేసేది కార్యకర్త.. ర్యాలీ తీసేది కార్యకర్త.. ఓట్లు వేయించేది కార్యకర్త..మన భాషలో చెప్పాలంటే దుక్కి దున్ని నారు పోసి, నాటు వేసి కలుపు తీసి, ధాన్యాన్ని పండించేది కార్యకర్త అయితే, ఆ వచ్చిన వరి ధాన్యాన్ని అమ్ముకునేది నాయకుడు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ కూడా అలాగే తయారైంది.

 ఇన్ని సంవత్సరాల రాజకీయ వ్యవస్థలో కార్యకర్తలు ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు. కానీ నాయకులు మాత్రం వారి అవసరాలకు అనుగుణంగా పార్టీలు మారుతూ, వారి అంతస్తులను పెంచుకుంటున్నారు. విలాసాలు అనుభవిస్తున్నారు. కార్యకర్తలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. ప్రస్తుతం దేశమంతా ఇదే పాలిటిక్స్ స్టాటజీ నడుస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కాస్త ఎక్కువగా నడుస్తుందని చెప్పవచ్చు. ఇక్కడ కుల ప్రాతిపదికన రాజకీయాలు చేస్తుంటారు. వీళ్ళ  రాజకీయం కోసం కార్యకర్తలను ఉసిగొలుపుతూ, వారి మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నాయకులు మాత్రం ఓడినా, గెలిచినా పార్టీలు మారుస్తూ వారి  స్వలాభం
 చూసుకుంటున్నారు అనేది జగమెరిగిన సత్యం. 

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్లో రాళ్ల రాజకీయం నడుస్తోంది. జగన్ పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడి చేసింది కూడా టిడిపికి సంబంధించిన వ్యక్తులని వైసిపి ఆరోపిస్తోంది. ఇది మరువకముందే మరోసారి పవన్ కళ్యాణ్ పై,చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగింది. ఇదే తరుణంలో టిడిపి నాయకులు ఇది వైసీపీ పని అని ఆరోపిస్తున్నారు. మరి వీరు ఆరోపణలు చేస్తున్నది ఏదో పెద్ద స్థాయి నేతల మీదనే కానీ ఎంక్వయిరీలు జరిగి దాడి చేసిన వ్యక్తులు దొరికితే మాత్రం అందులో ఏదో ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు మాత్రమే ఉంటారు. ఆ వ్యక్తులను అరెస్టు చేసి కటకటాలకు పంపిస్తే ఏ నాయకుడు కూడా రాడు. చివరకు బలయ్యేది కార్యకర్తలు మాత్రమే. ఈ దాడులకు ప్రేరేపించేది నాయకులే..

 రేపు గెలిచి అధికారంలో కూర్చునేది వారే. సంపాదించుకునేది కూడా వారే. కానీ చివరికి జైలు పాలయ్యేది మాత్రం కార్యకర్తలు. ఇన్నేళ్ల రాజకీయ వ్యవస్థలో నాయకుల ఆస్తులు పెరిగాయి తప్ప కార్యకర్తల ఆస్తులు ఎక్కడ పెరిగిన దాఖలు అయితే లేవు. కాబట్టి ఈ కుల,మత పిచ్చి రాజకీయాల్లో సాధారణ ప్రజలు కార్యకర్తలు పదవద్దని, మనకు మంచి చేసే నాయకున్ని మాత్రమే ఎంచుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు కావలసిన హక్కుల కోసం పోరాడాలని ప్రజాస్వామ్య నాయకులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నాయకుల కోసం ప్రాణాలు తీసే, ప్రాణాలు తీసుకునే కార్యకర్తలు ఒక్కసారి ఆలోచించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: