ఏపీ: కడపలో టీడీపీ పరిస్థితి ఇదే?

Suma Kallamadi
ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయం అనేది ఎక్కువగా కడప నియోజకవర్గం చుట్టూనే తిరుగుతోంది. విషయం ఏమిటంటే, వైఎస్ కుటుంబం రెండు ముక్కలు కావడంతో అక్కడ షర్మిల, జగన్ చుట్టూ మాత్రమే రాజకీయం తిరుగుతోంది. అక్కడ కాంగ్రెస్ తరుపున షర్మిల పోటీ చేయగా, కడప ఎంపీ స్థానానికి వైసీపీ తరుపున మళ్ళీ అవినాష్ రెడ్డి అక్కడ పోటీ చేయనున్నారు. దీంతో సొంతింటి పోరులో ఎవరు గెలుస్తారనే విషయంపై వాడివేడిగా చర్చలు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే షర్మిల మరియు అవినాష్ రెడ్డి ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రధాన నిందుతుడు అని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటే, ఇలాంటి వ్యాఖ్యలు విచక్షణ రహితమని అవినాష్ రెడ్డి షర్మిలపై విరుచుకు పడుతున్నాడు. ఇలా కడప పోలిటికల్ వేడి ఆ ఇరు వర్గాల వారిలో తారస్థాయిలో కొనసాగుతోంది. అదంతా ఒకెత్తయితే వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉండే కడప ఎంపీ స్థానంలో ఈసారి ఇద్దరు వైఎస్ కుటుంబం నుంచి పోటీ పడడంతో అక్కడ ప్రస్తుతం ఒకింత గందరగోళ పరిస్థితి ఉండడంతో కడప సీటుపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది.
టీడీపీ తరుపున కడప నుంచి 'చదిపిరాళ్ల భూపేష్ రెడ్డి'కి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించిన సంగతి విదితమే. అయితే ఇక్కడ టీడీపీ గెలిచే పరిస్థితులు దాదాపు లేకపోవడంతో పరోక్షంగా వైఎస్ షర్మిలకు మద్దతిచ్చేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని వినికిడి. భూపేష్ రెడ్డిని కేవలం నామ మాత్రంగా పోటీలో ఉంచుతూ షర్మిలా గెలుపు కోసం కష్టపడేలా బాబు వ్యూహ రచన చేసినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే షర్మిల వెనుక చంద్ర బాబు ఉన్నారని వైసీపీ నేతలు మరోవైపు బాహాటంగానే ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఇక ఇప్పుడు కడప సీటును టీడీపీ లైట్ తీసుకుంటే ఆ వార్తలకు మరింత బలం చేకూరే అవకాశం ఉంది. మరి ఎలాంటి రాజకీయ పరిస్థితులనైనా తనకు అనుకూలంగా మార్చుకునే బాబు కడప విషయంలో ఆయన వ్యూహాలు భవిషత్తులో ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: