ఏపీ : ఆ మూడు హామీల విషయంలో వైసీపీ వెనుకడుగు.. జగన్ మాట తప్పారా?

Reddy P Rajasekhar
ఏపీ సీఎం వైఎస్ జగన్ మాట తప్పను మడమ తిప్పనని తరచూ చెబుతూ ఉంటారు. మరి సీఎం జగన్ నిజంగానే మాట తప్పరా? అనే ప్రశ్నకు మాత్రం కాదనే సమాధానం వినిపిస్తోంది. ప్రధానంగా మూడు హామీల విషయంలో వైసీపీ వెనుకడుగు వేయడం ఏపీ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. ఆ మూడు హామీలను జగన్ అమలు చేసి ఉంటే వైసీపీ స్థాయి మరింత పెరిగేదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ హామీల విషయంలో జగన్ నిర్ణయాన్ని మార్చుకోవాలని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.
 
ఏపీలో దశల వారీగా మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పిన జగన్ ఆ హామీని అమలు చేయలేదు. మరోవైపు ఏపీలో ఉన్న మద్యం బ్రాండ్ల వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీలో మద్యం రేటు కూడా ఎక్కువేననే సంగతి తెలిసిందే. మద్యపాన నిషేధం విషయంలో జగన్ వెనుకడుగు వేయడానికి ఏపీ ఆర్థిక ఇబ్బందులే కారణమని తెలుస్తోంది.
 
రాబోయే రోజుల్లో అయినా పూర్తిస్థాయిలో మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తే మంచిది. మద్యం వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమవుతున్నాయి. మరోవైపు ప్రత్యేక హోదా విషయంలో జగన్ మాట తప్పడం వైసీపీ అభిమానులను సైతం బాధ పెడుతోంది. వైసీపీ తరపున 22 మంది ఎంపీలు గెలిచినా జగన్ ప్రత్యేక హోదా సాధించుకోలేకపోయారు. బీజేపీ నేతలతో జగన్ కు సత్సంబంధాలు ఉన్నా ప్రత్యేక హోదా విషయంలో జగన్ కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో ఫెయిల్ అయ్యారు.
 
సీపీఎస్ అమలు విషయంలో జగన్ వెనుకడుగు వేయడం విషయంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆవేదన అంతాఇంతా కాదు. సీపీఎస్ కు ప్రత్యామ్నాయంగా జగన్ సర్కార్ హామీలు ఇస్తున్నా ఆ హామీల వల్ల ప్రయోజనం శూన్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కార్ కచ్చితంగా అమలు చేయాల్సిన హామీల విషయంలో వెనుకడుగు వేసింది. అమలు చేయని హామీల గురించి స్పందించడానికి వైసీపీ నేతలు సైతం ఇష్టపడటం లేదు.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: