జ‌గ‌న్ చేసిన కామెంట్.. బాబు గ్రాఫ్ పెంచిందా..!

RAMAKRISHNA S.S.
రాజ‌కీయాల్లో ఒక్కొక్క సారి నాయ‌కులు చేసే కామెంట్లు ప్ర‌త్య‌ర్థుల‌కు వ‌రంగా మారుతుంది. ఈ విష‌యం లో పార్టీలు ఆచితూచి వ్య‌వ‌హ‌రించాలి. పైగా కీల‌క ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీల అధినేత‌లు చేసే వ్యాఖ్య‌లు మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేక‌పోతే తామేదో అనుకుని చేసిన కామెంట్లు త‌ర్వాత‌.. అవే త‌మ‌కు వ్య‌తిరేకంగా మార‌డం ఖాయం. సిద్ధం స‌భ‌లు మొద‌లు పెట్టిన రోజు నుంచి సీఎం జ‌గ‌న్ త‌న ప్ర‌చార పంధాను మార్చుకున్నారు. మ‌హాభార‌తంలోని పాత్ర‌ల‌ను తెర‌మీదికి తెచ్చారు.
త‌న‌ను తాను అర్జునుడిగా పోల్చుకున్నారు. దీనికి టీడీపీ నుంచి పెద్ద‌గా రియాక్ష‌న్ రాలేదు. అర్జునుడు కాదు.. భ‌స్మాసురుడు అన్నా కూడా.. పెద్ద‌గా జ‌నాల్లోకి వెళ్ల‌లేదు. ఆత‌ర్వాత‌. కూడా ఇలాంటి వ్యాఖ్య‌లు జ‌గ‌న్ చేశారు. ప్ర‌జ‌లే త‌న‌కు శ్రీకృష్ణుడిగా మారి న‌డిపించాల‌న్నారు. దీనికి కూడా విప‌క్షాల నుంచి పెద్ద‌గా కౌంట‌ర్లు రాలేదు. దీంతో ఈ రెండు ప్ర‌యోగాలు జ‌గ‌న్‌కు స‌క్సెస్ అయ్యాయి. దీనినే ఎన్నిక‌ల్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు.
అయితే.. తాజాగా ఎమ్మిగ‌నూరు స‌భ‌లో జ‌గ‌న్ మాట్లాడుతూ.. చంద్ర‌బాబును అరుంధ‌తి సినిమాలో విల‌న్ పాత్ర ప‌శుప‌తితో పోల్చారు. దీనిని ఆయ‌న ఒక ఉద్దేశంతో వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు ను ఒక దారుణ మైన విల‌న్‌తో పోల్చ‌డంతో ఇది టీడీపీకి మైన‌స్ అవుతుంద‌ని అంద‌రూ అంచ‌నా వేసుకున్నారు. కానీ, ఇక్క‌డే చంద్ర‌బాబు విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించారు. రాజ‌కీయాన్ని అనూహ్య‌మైన మ‌లుపు తిప్పారు. త‌న‌ను ప‌శుప‌తితో పోల్చిన జ‌గ‌న్‌పై ఎలాంటి ఎదురు దాడి చేయ‌లేదు. పైగా తాను ప‌శుప‌తినేన‌ని ఒప్పుకొన్నారు.
అంతేకాదు.. దీనికి వివ‌ర‌ణ కూడా ఇచ్చారు. ఔను.. నేను ప‌శుప తినే. గ‌రళాన్ని కంఠంలో దాచుకున్న ఆ ప‌శుప‌తినాథుడి (శివుడు) మాదిరిగాతాను రాష్ట్రం కోసం అనేక క‌ష్టా లు ఎదుర్కొంటున్నాన‌ని.. అయినా తాను ఇష్టంగానే ప్ర‌జ‌ల మ‌ధ్య కు వ‌చ్చాన‌ని పదే ప‌దే చెప్పుకొచ్చారు. ఈ వాద‌న స‌క్సెస్ అయింది. చంద్ర‌బాబు చేసిన ఈ కామెంట్లు జ‌గ‌న్ చేసిన ప‌శుప‌తి వాద‌న‌ను తోసిపుచ్చాయి. అంతేకాదు.. ప్ర‌స్తుతం రాష్ట్రం ఉన్న ప‌రిస్థితి ని కూడా క‌ళ్ల‌క‌ట్టాయి. దీంతో జ‌గ‌న్ చేసిన ప్ర‌యోగం విక‌టించి.. చంద్ర‌బాబుకు అనుకూలంగా మారింద‌నే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: