అమరావతి : తమ్ముళ్ళు, జనసేనలో టెన్షన్ పెరిగిపోతోందా ?
మూడుపార్టీల కూటమి నేతల్లో టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. టీడీపీ,జనసేన, బీజేపీ పొత్తుపెట్టుకున్న విషయం తెలిసిందే. పొత్తయితే పెట్టుకున్నాయి కాని సీట్ల పంచాయితి తేలలేదు. ఏ పార్టీ ఎన్నిసీట్లలో పోటీచేయాలనే విషయంలో టీడీపీ, బీజేపీ మధ్య చర్చలు ఎంతకీ తెగటంలేదు. అలాగే పోటీచేయబోయే నియోజకవర్గాల విషయంలో కూడా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. 8 ఎంపీ, 8 అసెంబ్లీ సీట్లను కచ్చితంగా ఇచ్చి తీరాల్పిందే అని బీజేపీ తరపున చర్చల్లో కూర్చున్న కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్, జాతీయపార్టీ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా పట్టుబట్టారు.
దీనికి చంద్రబాబునాయుడు అంగీకరించలేదని సమాచారం. ఢిల్లీలో 6 ఎంపీలు, 6 ఎంఎల్ఏ సీట్లు ఫైనల్ అయిన విషయాన్ని చంద్రబాబు ప్రస్తావించారట. అయితే ఢిల్లీలో టీడీపీ ఎన్డీయేలో చేరే విషయం మాత్రమే ఫైనల్ అయ్యిందని సీట్ల సంఖ్య, పోటీచేయబోయే నియోజకవర్గాలు కాదని షెకావత్ గట్టిగానే చెప్పారట. దాంతో చంద్రబాబు, పవన్ ఇద్దరు ఖంగుతిన్నట్లు సమాచారం. ఉదయం నుండి రాత్రివరకు కూర్చుని చర్చలు జరిపినా పెద్దగా పురోగతి కనబడలేదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హోలుమొత్తంమీద ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి లేకుండానే చర్చలు జరుగిపోతున్నాయి. చర్చల్లో పురందేశ్వరి ప్రమేయం దాదాపు శూన్యమనే చెప్పాలి. మరి సీట్ల సర్దుబాటు చర్చల్లో పురందేశ్వరిని పార్టీ ఎందుకు దూరంగా పెట్టిందో అర్ధంకావటంలేదు. దీనిపై ఆమె ఏదో సమర్ధించుకుంటున్నట్లు మాట్లాడారు. పొత్తులు, అభ్యర్ధుల ఎంపిక అంతా అధిష్టానమే చూసుకుంటుందన్నారు. పొత్తులు కుదుర్చుకునే విషయంలో అధిష్టానందే ఫైనల్ డెసిషన్ అంటే అర్ధముంది. కాని పొత్తు కుదిరినతర్వాత జరుగుతున్న సీట్ల సర్దుబాటులో పురదేశ్వరిని అగ్రనేతలు దూరంగా పెట్టేయటమే ఆశ్చర్యంగా ఉంది.
అలాగే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పోటీ విషయం కూడా చర్చకు వచ్చిందట. మూడుపార్టీల నేతలు రఘురాజును మీ పార్టీలో చేర్చుకోమని అంటే కాదు మీరే చేర్చుకుని టికెట్ ఇవ్వమని ఎవరికి వారు చెప్పారట. అయితే రాజును చేర్చుకుని టికెట్ ఇవ్వటానికి మూడుపార్టీలు అంగీకరించలేదని సమాచారం. రాజు ట్రాక్ రికార్డే దీనికి కారణమని తెలుస్తోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.