అమరావతి : రాజకీయాలకు జయదేవ్ గుబ్ బై..మిడిల్ డ్రాపేనా ?

Vijaya

రాజకీయాలకు తాత్కాలికంగా గుడ్ బై చెప్పేశారు టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్. ఈ విషయాన్ని జయదేవే స్వయంగా ప్రకటించారు. గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నేతలతో పాటు జిల్లాలోని ముఖ్యులకు జయదేవ్ వీడ్కోలు విందిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతు రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నట్లు చెప్పారు. వ్యాపారవేత్తగా ఉంటూనే రాజకీయాల్లో కూడా సక్సెస్ కావచ్చని అనుకున్నా  సాధ్యంకాలేదన్నారు. పూర్తిస్ధాయి వ్యాపారవేత్తగా రాణించాలంటే రాజకీయాల్లో ఉండకూడదన్న విషయం అర్ధమైందన్నారు.





ఎంపీగా తాను పార్లమెంటులో వివిధ అంశాలపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీసినందుకు వ్యాపారవేత్తగా ఇబ్బందులు పడినట్లు చెప్పారు. తన వ్యాపారాలను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు టార్గెట్ చేసినట్లు చెప్పారు. అయినా తాను భయపడకుండా గట్టిగా నిలబడ్డానన్నారు. రాష్ట్ర విభజన అంశాలపై తాను పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీసినందుకు ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఉన్నతాధికారులు తనను పిలిచి వార్నింగిచ్చినట్లు చెప్పటం ఇపుడు కలకలం రేపుతోంది. అసలీ విషయాలు ఎందుకు చెప్పారో కూడా అర్ధంకావటంలేదు.





రాజకీయాలకు తాత్కాలికంగా బ్రేక్ తీసుకోవాలని అనుకున్న ఎంపీ తానుపడిన కష్టాలను, ఎదుర్కొన్న సమస్యలను బహిరంగంగా చెప్పాల్సిన అవసరంలేదు. రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందే ఎదురవ్వబోయే కష్టనష్టాల గురించి ఆలోచించుకుని ఉండాల్సింది. ఫీడ్ బ్యాక్ ఇవ్వటానికి ఎలాగూ తన తల్లి గల్లా అరుణకుమారి ఉండనే ఉన్నారు. ఆమె కూడా దశాబ్దాలుగా యాక్టివ్ పొలిటీషియనే. మూడుసార్లు ఎంఎల్ఏగా గెలిచి ఏకదాటిగా పదేళ్ళు మంత్రిగా పనిచేశారు. ఇక్కడ సమస్య ఏమిటంటే వ్యాపారాలు, రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకోలేకపోవటం జయదేవ్ చేతకానితనాన్నే బయటపెట్టింది.





రెండు రంగాల్లోను జయదేవ్ కాకుండా ఇంకా చాలామందే ఉన్నారు. వాళ్ళెవరికీ ఎదురవ్వని ఇబ్బందులు  జయదేవ్ కు మాత్రమే ఎందుకొచ్చాయన్నదే ప్రశ్న.  ఏదేమైనా జయదేవ్ రాబోయే ఎన్నికల్లో పోటీచేయకూడదని డిసైడ్ చేసుకోవటం టీడీపీకి పెద్ద ఇబ్బందనే చెప్పాలి. ఆర్ధికంగా అత్యంత పటిష్టమైన స్ధితిలో ఉన్న జయదేవ్ కు ప్రత్యామ్నాయం చూసుకోవటం చంద్రబాబునాయుడుకు అంత తేలికకాదు. ఎంపీగా పోటీచేయటం మామూలు విషయం కాదు. మరీ సమస్యను చంద్రబాబు ఎలా అధిగమిస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: