అమరావతి : రెడ్ల విషయంలో టీడీపీ ప్లాన్ ఇదేనా ?

Vijaya

చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. ఎప్పుడు ఏ పార్టీకి మద్దతిస్తారో ఎప్పుడు ఏ పార్టీని వ్యతిరేకిస్తారో కూడా ఎవరు ఊహించలేరు. పోనీ తన వ్యూహాల వల్ల టీడీపీకి ఏమన్నా లాభం జరుగుతోందా అంటే అదీలేదు. ఇలాంటి అవుట్ డేటెడ్ వ్యూహాల వల్ల ఇప్పటికే రెండుసార్లు పార్టీ నష్టపోయినా ఇంకా చంద్రబాబు తన పద్దతిని మార్చుకోవటంలేదు. ఇపుడిందతా ఎందుకంటే తెలంగాణా విషయంలో అమలుచేస్తున్న వ్యూహం కారణంగానే.



ఇపుడు విషయం ఏమిటంటే తెలంగాణాలో ఎలాగైనా బీఆర్ఎస్ ను ఓడించి కేసీయార్ ను దెబ్బకొట్టాలన్నది చంద్రబాబు పంతం. అందుకనే ఎన్నికల్లో పోటీచేయకుండా పార్టీని తప్పించారు. ఎందుకోసం అంటే కాంగ్రెస్ కు మేలుచేయటం కోసమే. 2018లో డైరెక్టుగా కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకుని దెబ్బతిన్న చంద్రబాబు ఈసారి పరోక్షంగా సాయం చేస్తున్నారు. ఎందుకంటే కేవలం రేవంత్ రెడ్డి కోసమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి, రేవంత్ సీఎం అయితే తాను ముఖ్యమంత్రి అయినట్లే అన్నది చంద్రబాబు ఆలోచన.



అందుకనే సొంతపార్టీని ఫణంగా పెట్టేసి తెలంగాణాలో రెడ్లకు మద్దతుగా పనిచేయిస్తున్నారు. రెడ్లకు టీడీపీ మద్దతని ఎక్కడా బహిరంగంగా చెప్పలేదు కానీ రేవంత్ కు మద్దతుగా నిలబడటం అంటే రెడ్లకు సపోర్టు చేస్తున్నట్లే లెక్క. కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న అభ్యర్ధుల్లో రెడ్ల సంఖ్య గణనీయంగా ఉంది. టీడీపీ ఓట్లు, కమ్మోరి ఓట్లు లేదా సీమాంధ్ర ఓట్లను కాంగ్రెస్ కు వేయించటంలో చంద్రబాబు చాలా బిజీగా ఉన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా ? వచ్చినా రేవంత్ సీఎం అవుతారా అన్నది డిసెంబర్ 3వ తేదీ తర్వాత చూడాల్సిందే.



సీన్ కట్ చేస్తే ఏపీ విషయానికి వచ్చేసరికి రెడ్లను టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కారణం ఏమిటంటే ఏపీలో  రెడ్లంటే  వైసీపీ రెడ్లట. అక్కడేమో రేవంత్ అత్యంత ఇష్టుడు, తన భవిష్యత్తుకు మార్గం చూపించేవాడు కాబట్టి తెలంగాణా రెడ్లను చంద్రబాబు ఓన్ చేసుకుంటున్నారు. ఏపీకి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి చావగొడుతున్నాడు కాబట్టి నాన్ టీడీపీ రెడ్లను వ్యతిరేకిస్తున్నారు. నిజానికి రెడ్లు వైసీపీలో ఉన్నట్లే టీడీపీలో కూడా ఉన్నారు. అలాగే జగన్ అంటే మంటగా ఉన్న రెడ్లు కూడా ఉన్నారు. అయినా ప్రాంతాన్ని బట్టి రెడ్లను టీడీపీ వేర్వేరుగా చూస్తోంది. మరి రాబోయే ఎన్నికల్లో ఈ వ్యూహం ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: