హైదరాబాద్ : టీడీపీ మరీ ఇంత చీపైపోయిందా ?

Vijaya

తెలంగాణాలో తాజా రాజకీయ పరిణామాలను గమనించిన తర్వాత బీజేపీ దృష్టిలో టీడీపీ ఎంత చీపైపోయిందో అర్ధమవుతోంది. తొందరలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ-జనసేనలు పొత్తు పెట్టుకోబోతున్నాయి. నిజానికి బీజేపీతో పొత్తు పెట్టుకోవటం ద్వారా జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన స్ధాయిని తానే దిగజార్చేసుకున్నారు. ఎలాగంటే జనసేన 32 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీచేయబోతోందని పవనే ప్రకటించారు. అలాంటిది ఇపుడు బీజేపీతో పొత్తులో పది సీట్లకు పరిమితమవుతోందనే ప్రచారం అందరికీ తెలిసిందే.





ఒంటరిగానే 32 సీట్లకు పోటీచేయటానికి డిసైడ్ అయిన జనసేన మరి పొత్తులో పది సీట్లకే పరిమితమైందంటే పవన్ స్ధాయి పడిపోయిందని అర్ధమవుతోంది. పవన్ విషయాన్ని పక్కనపెట్టేస్తే జనసేనతో పొత్తు పెట్టుకోవటం ద్వారా టీడీపీని బీజేపీ ఎంత అంటరాని పార్టీగా చూస్తోందో అర్ధమవుతోంది. తెలంగాణాలో బీజేపీ, టీడీపీ పొత్తుపెట్టుకోబోతున్నట్లు ఆమధ్య బాగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని ఎల్లోమీడియా బాగా ఊదరగొట్టింది. అయితే తర్వాత టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తేల్చిచెప్పారు.





టీడీపీతో పొత్తుండదని చెప్పిన బీజేపీ ఇపుడు జనసేనతో పొత్తుకు రెడీ అయ్యింది. ఏ రకంగా చూసినా జనసేనకన్నా టీడీపీనే తెలంగాణాలో బలంగా ఉంది. టీడీపీకి అంటు ఎంతో కొంత ఓటు బ్యాంకు కొన్ని నియోజకవర్గాల్లో  ఇంకా ఉంది. జనసేనకు అసలు ఓటుబ్యాంకు ఎంతుందనే విషయం కూడా ఎవరికీ తెలీదు. తెలంగాణాలో ఉన్న కాపుల ఓట్ల కోసమే జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటోందని కమలంపార్టీ నేతలు చెబుతున్నారు.





ఇదే నిజమైతే మరి తెలంగాణాలో ఉన్న కమ్మ సామాజికవర్గం ఓటు బ్యాంకు సంగతి ఏమిటి ? తెలంగాణాలో కాపులున్నట్లే కమ్మోరు కూడా ఉన్నారు కదా. కమ్మ ఓట్లకోసమే టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటోందని ఒకపుడు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. తీరాచూస్తే కమ్మోరి ఓటు బ్యాంకు కన్నా బీజేపీకి కాపుల ఓట్లే ముఖ్యమని అనిపించినట్లుంది. అందుకనే టీడీపీని దూరంగా పెట్టేసి జనసేనతో పొత్తు పెట్టుకుంటోంది. జరుగుతున్నది చూస్తుంటే బీజేపీ దృష్టిలో టీడీపీ ఎంత చీపైపోయిందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: