అమరావతి : చంద్రబాబు పరిస్ధితి ఇలాగైపోయిందా ?
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు పరిస్ధితి చివరకు ఇలాగైపోయింది. ఎంతసేపు లేస్తే మనిషిని కాను అంటూ నెట్టుకురావాలని చేస్తున్న ప్రయత్నమే తప్ప లేవటానికి చేసిన ప్రయత్నం లేదు. అందుకనే పార్టీ పరిస్ధితి ఇపుడు ఇలాగైపోయింది. ఇంతకీ విషయం ఏమిటంటే ఐదు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్ధితిపై అధినేత రివ్యూ చేశారు. ఈ సందర్భంగా అందరిపైనా చంద్రబాబు మండిపోయారు. ఎన్నిసార్లు చెప్పినా గ్రూపు రాజకీయాలు మానుకోవటంలేదని, విభేదాలతో గొడవలపడుతు పార్టీ పరువును రోడ్డు మీదకు ఈడుస్తున్నారంటు మండిపోయారు.
కందుకూరు, గుంతకల్లు, అనకాపల్లి, యలమంచిలి, కైకలూరు నియోజకవర్గాల సమీక్షలో నేతలమధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇంతకాలం నియోజకవర్గాల్లో ఉన్న విభేదాలు తాజాగా చంద్రబాబు సమక్షంలోనే బయటపడ్డాయి. ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో కూడా విభేదాలను పక్కనపెట్టి ఐకమత్యంతో సాగకపోతే ఎలాగంటు తమ్ముళ్ళని నిలదీశారు. కందుకూరు నియోజకవర్గంలోని నేతలంతా ఐకమత్యంతో ముందుకు సాగలన్నారు.
గుంతకల్లు ఇన్చార్జి జితేంద్రగౌడ్ పనితీరు ఏమాత్రం బాగాలేదన్నారు. పనితీరు మెరుగుపరుచుకుపోతే కష్టమని చెప్పారు. అనకాపల్లి నియోజకవర్గంలోని నేతలపై తీవ్రస్ధాయిలో మండిపోయారు. ఎన్నిసార్లు చెప్పినా విభేదాలను పక్కనపెట్టి పనిచేసే విషయాన్ని ఎందుకు ఆలోచించటంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ ఎంఎల్ఏ పీలా గోవిందు, మరో మాజీ ఎంఎల్సీ బుద్ధ నాగజగదీష్ ఇద్దరికీ తలంటు పోశారు. ఎన్నిసార్లు చెప్పినా విభేదాలను పక్కనపెట్టక పోవటంపై ఇద్దరిపైనా మండిపోయారు. గ్రూపులు కట్టి పార్టీని దెబ్బతీస్తానంటే సహించేది లేదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
యలమంచిలి నియోజకవర్గం నేతలపనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పార్టీ కార్యక్రమాలను సక్రమంగా ఫాలో అవటంలేదన్నారు. నేతలందరినీ కలుపుకుని పోకపోతే పార్టీ బలోపేతం ఎలాగవుతుందని ఇన్చార్జి ప్రగాఢ నాగేశ్వరరావును నిలదీశారు. కైకలూరు నియోజకవర్గానికి స్ధానికనేతనే ఇన్చార్జిగా నియమించాలని నేతలు గట్టిగా కోరారు. విభేదాలను పక్కనపెట్టి తాను సూచించిన నేతకు అందరు మద్దతుగా నిలవాలని గట్టిగా చెప్పారు. సో హోలుమొత్తంమీద రివ్యూ చేసిన ఐదు నియోజకవర్గాల్లో పరిస్ధితి ఏమాత్రం బావోలేదని అర్ధమవుతోంది. పార్టీ మాటవినని నేతలపై చంద్రబాబు ఎప్పుడైనా కఠిన నిర్ణయం తీసుకునుంటే మిగిలిన వాళ్ళు భయపడతారు. అలా కాకుండా ఊరికే భయపెడుతుంటే ఎవరైనా భయపడతరారా ?