అమరావతి : టీడీపీలో అయినా టికెట్ ఇస్తారా ?
వైసీపీకి గుడ్ బై చెప్పిన యార్లగడ్డ వెంకట్రావు విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగుదేశంపార్టీలో చేరటానికి చంద్రబాబునాయుడు అపాయిట్మెంట్ అడిగారట. చంద్రబాబు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళి కలుస్తారట. ఇంతవరకు బాగానే ఉంది కానీ తర్వాత మాట్లాడుతు గన్నవరం అభ్యర్ధిగా తాను పనికొస్తానని అనుకుంటే తనకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబును యార్లగడ్డ మద్దతుదారులతో నిర్వహించిన సమావేశంలో విజ్ఞప్తిచేశారు. రాబోయే ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ టికెట్ ఇస్తే గెలిచి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని కలుస్తానని ప్రకటించారు.
అపాయిట్మెంట్ కోరటం, అసెంబ్లీలో జగన్ను కలుస్తానని చెప్పటం ఓకేనే. కానీ తాను గన్నవరం అభ్యర్ధిగా పనికొస్తానని అనుకుంటేనే తనకు టికెట్ ఇవ్వమని చంద్రబాబును కోరటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంఎల్ఏ టికెట్ ఇస్తే గెలుస్తారని అనుకుంటే ఆ టికెట్ ఏదో జగనే ఇచ్చుండేవారు కదా. 2019లో టికెట్ ఇస్తే ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. యార్లగడ్డకన్నా వల్లభనేని వంశీయే మంచి క్యాండిడేట్ అనుకునే కదా వంశీకే టికెట్ జగన్ ప్రకటించింది.
కాకపోతే యార్లగడ్డకు ఒక అవకాశముంది. అదేమిటంటే గన్నవరంలో టీడీపీకి బలమైన అభ్యర్ధి లేక నానా అవస్తలు పడుతున్నారు. పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి లాంటి వాళ్ళు కొందరు టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ చంద్రబాబు మనసులో ఏముందో తెలీదు. నియోజకవర్గం ఇన్చార్జి బచ్చుల అర్జునుడు చనిపోయిన తర్వాత నియోజకవర్గంలో గట్టి ఇన్చార్జిని కూడా పెట్టలేకపోయారు. ఇదొక్కటే యార్లగడ్డకు కాస్త కలిసొచ్చే అంశం. అంతమాత్రాన యార్లగడ్డకు చంద్రబాబు టికెట్ ఇచ్చేస్తారని కాదు.
ఎందుకంటే ఒకరికి టికెట్ ఇవ్వాలంటే చంద్రబాబు ఎన్ని సమీకరణలు చూస్తారో ఎవరికీ తెలీదు. ఏదేమైనా యార్లగడ్డ తన బలహీనతను తానే బయటపెట్టుకున్నారు. ఎలాగంటే రెండేళ్ళనుండి అపాయిట్మెంట్ అడుగుతుంటే జగన్ ఇవ్వలేదన్నారు. అంటే తమ నేత రెండేళ్ళుగా జగన్ అపాయిట్మెంటే తీసుకోలేని వాళ్ళా అని మద్దతుదారులకు ఇపుడు తెలుసుంటుంది. అపాయిట్మెంటే ఇవ్వని జగన్ ఇక టికెట్ ఇస్తారని యార్లగడ్డ ఎలాగ అనుకున్నారో. అలాగే యార్లగడ్డ గట్టి అభ్యర్ధి అని అనుకుంటే చంద్రబాబు ఎప్పుడో వల విసిరేవారే. అలా చేయలేదంటే యార్లగడ్డ ఎంఎల్ఏ మెటీరియల్ అని చంద్రబాబు కూడా అనుకోలేదేమో.