కేసీఆర్‌కు మళ్లీ తమిళిసై ఝలక్.. తలనొప్పి తప్పదా?

Chakravarthi Kalyan
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు మళ్లీ గవర్నర్ తమిళిసై ఝలక్ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు సహా అన్ని బిల్లులపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ న్యాయ సలహా కోరారు. ఈ బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్లు రాజ్ భవన్ తాజా ఓ ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్, సచివాలయ నిబంధనలకు లోబడి బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్లు రాజ్‌ భవన్‌ తెలిపింది.


ఉద్యోగుల శ్రేయస్సు, కార్పోరేషన్ బాగు కోరి కొన్ని సిఫారసులతో ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతించినట్లు రాజ్ భవన్ చెబుతోంది. ఇదే తరహాలో గతంలో వెనక్కు పంపిన నాలుగు బిల్లులకు సంబంధించి సిఫారసులతో కూడిన సందేశాన్ని పంపినట్లు రాజ్‌భవన్‌ గుర్తు చేసింది. ఆ సిఫారసులను పరిగణలోకి తీసుకున్నారా... లేదా... అన్న అంశాన్ని గవర్నర్ నిర్ధారించుకోవాలని అనుకుంటున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది.


దీంతో న్యాయశాఖ కార్యదర్శి చేసే సిఫారస్సుల ఆధారంగా బిల్లుపై తదుపరి చర్యలు ఉంటాయని కూడా తెలంగాణ రాజ్ భవన్ స్పష్టం చేసింది. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపినట్లు, రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో మీడియాకు ఈ ప్రకటన విడుదల చేస్తున్నట్లు రాజ్‌భవన్‌ వివరించింది.


కొందరు కావాలని దురుద్దేశంతో చేస్తున్న అసత్యాలు, నిరాధార ప్రచారంతో ఆందోళనకు గురికావద్దని ప్రజలను గవర్నర్‌ విజ్ఞప్తి చేశారు. అందులోనూ ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్టు రాజ్‌ భవన్‌ నుంచి వచ్చిన తాజా ప్రకటన తెలిపింది.


అయితే రాజ్‌భవన్ ప్రకటనతో ఇప్పుడు ఆ బిల్లుల భవితవ్యంపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ బిల్లులను గవర్నర్‌ కొంతకాలంగా ఆపుతున్నారు. మరి ఇప్పటికైనా ఈ బిల్లులకు మోక్షం కలుగుతుందా అన్న దానిపై స్పష్టత రావడం లేదు. చూడాలి ఏం జరుగుతుందో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: