అమరావతి : వాలంటీర్లపై మాట మార్చిన పవన్

Vijaya



వాలంటీర్ల విషయంలో నోటికొచ్చిన ఆరోపణలు చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బాగా ఒత్తిళ్ళు పెరిగిపోతున్నట్లున్నాయి. అందుకనే మాట మార్చేశారు. సమస్య వాలంటీర్లతో కాదని వాలంటీర్ల వ్యవస్ధ పనితీరుమీదే అని నాలుక మడతేశారు. పార్టీ నేతలతో పవన్ మాట్లాడుతు వాలంటీర్లను సంరక్షించాలని కూడా అన్నారు. మనం వాలంటీర్లకు వ్యతిరేకం కాదన్న విషయాన్ని నేతలు జనాల్లో బాగా ప్రచారం చేయాలన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హ్యూమన్ ట్రాఫికింగుకు వాలంటీర్లే కారణమని పవన్ ఆరోపించిన విషయం తెలిసిందే. జనసేన అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్ధ నడుం విరగొడతాననని ప్రకటించారు.





తమపై పవన్ చేసిన ఆరోపణలపై రెచ్చిపోయిన వాలంటీర్లు నాలుగురోజులు ఆందోళనలు చేశారు. తానుచేసిన ఆరోపణలపై ప్రతిపక్షాల్లో ఏ ఒక్కటి పవన్ కు మద్దతుగా నిలబడలేదు.  తాను పొత్తుపెట్టుకోవాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబునాయుడు కూడా వాలంటీర్ల వ్యవస్ధను కంటిన్యుచేస్తామనే ప్రకటించారు. దాంతో పవన్ పై అన్నీవైపుల నుండి ఒత్తిళ్ళు పెరిగిపోయింది. ఈ నేపధ్యంలోనే వారాహియాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఇపుడు మళ్ళీ మంగళగిరి పార్టీ ఆఫీసులో నేతలు, కార్యకర్తలతో మీటింగులు పెట్టుకుంటున్నారు.





ఎప్పుడైతే పవన్ సమీక్షలు చేస్తున్నారో మళ్ళీ వాలంటీర్ల వ్యవహారం చర్చకు వచ్చినట్లుంది. అందుకనే మాటమార్చారు. వాలంటీర్లకు ప్రత్యామ్నాయ ఆదాయమార్గాలను కూడా చూపించాలన్నారు. వాలంటీర్లలో ఎక్కడో ఒక్కళ్ళో ఇద్దరో తప్పులు చేస్తే చేయచ్చు మానవ సహజమన్నారు. వాలంటీర్ల పైన తనకు ఎలాంటి కోపం లేదన్నారు. వాలంటీర్ల సమస్య డేటా బేస్ ప్రైవసీకి సంబంధించినదిగా చెప్పారు.





ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్ధను పెట్టి పంచాయితీరాజ్ వ్యవస్ధను చంపేస్తోందన్నారు. వాలంటీర్లకు తెలీకుండానే వాళ్ళతో క్రైం చేయిస్తున్నట్లు పవన్ చెప్పారు. వైఎస్సార్ ఉన్నపుడు ఐఏఎస్ అధికారులు ఎలా దొరికిపోయారే రేపు వాలంటీర్లు కూడా అలాగే ఊరికొకళ్ళు, వార్డకొకరు  దొరికిపోతారట. అందుకని వాలంటీర్లను సంరక్షించాల్సిన బాధ్యత జనసేన మీదుందన్నారు. మొత్తానికి వాలంటీర్లపై ఆరోపణలు చేయటం వల్ల పార్టీకి డ్యామేజి జరగటం ఖాయమని అందరు చెప్పినట్లున్నారు. వాలంటీర్ల ద్వారా జరగుతుందని అనుకుంటున్న డ్యామేజీని కంట్రోల్ చేయటం కోసమే పవన్ మాట మార్చినట్లు అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: