హైదరాబాద్ : వనమాకు హైకోర్టు షాక్..అసలు ట్విస్టిదేనా ?
తెలంగాణాలో ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎంఎల్ఏ వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టు పెద్ద షాకిచ్చింది. 2018 ఎన్నికల్లో గెలిచిన వనమా తన కుటుంబం ఆస్తులను కావాలనే తప్పుగా చూపించినట్లు ఓడిపోయిన అభ్యర్ధి జలగం వెంకటరావు కోర్టులో పిటీషన్ వేశారు. ఇన్ని సంవత్సరాలుగా కేసును విచారించిన హైకోర్టు మంగళవారమే తీర్పిచ్చింది. ఆ తీర్పు ప్రకారం వనమాపై అనర్హత వేటుపడింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసినందుకు వనపై అనర్హత వేటు పడటమే కాకుండా రు. 5 లక్షల జరిమానా కూడా విధించింది.
పై రెండింటికన్నా ఇంకా పెద్ద శిక్షపడింది. అదేమిటంటే రాబోయే ఆరుసంవత్సరాల్లో పోటీచేయటానికి లేకుండా నిషేధించింది. ఇపుడు ఎంఎల్ఏ పదవి పోవటమన్నది పెద్ద విషయం కాదు. ఎందుకంటే అసెంబ్లీకి ఉన్న కాలపరిమితి మహాయితే మరో నాలుగు నెలలు మాత్రమే. నాలుగు నెలల ఎంఎల్ఏ పదవి ఉన్నా ఒకటే పోయినా ఒకటే. అయితే దీనికిమించిన శిక్ష ఏమిటంటే తర్వాత ఎన్నికల్లో పోటీచేయకుండా నిషేధం విధించటమే.
వనమా అదృష్టం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో పోటీచేసినా గెలిచేది అనుమానమే అంటున్నారు. 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన వనమా తర్వాత బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. గడచిన నాలుగున్నరేళ్ళల్లో వనమా ఇమేజి దారుణంగా దెబ్బతినేసింది. ఎందుకంటే వనమా కొడుకు వనమా రాఘవేంద్ర అరాచకాలు వెలుగుచూడటంతోనే ఎంఎల్ఏపై జనాల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగిపోయింది.
ఆమధ్య కొత్తగూడెం పట్టణంలోనే ఉండే ఒక ఫ్యామిలీ రాఘవంద్ర అరాచకాన్ని తట్టుకోలేక మంటలకు ఆహూతైన విషయం తెలుగురాష్ట్రాల్లో ఎంత సంచలనమైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. భూముల కబ్జా, అత్యాచారాలు, వేధింపులు, బలవంతంగా డబ్బుల వసూళ్ళు లాంటి అనేక ఆరోపణలు కొడుకు మీదుంది. వీటన్నింటినీ ఎంఎల్ఏ వెనకేసుకొచ్చారు. దానివల్లే జనాలంతా బాగా మండిపోతున్నారు. కాబట్టి వనమాకు మళ్ళీ టికెట్ ఇచ్చినా గెలిచేది కష్టమనే భావన పెరిగిపోయింది. అందుకనే కేసీయార్ కూడా వనమాకు టికెట్ ఇచ్చే విషయంలో వెనకాడుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. పదవీకాలం ముగిసేసమయంలో తీర్పు రావటమే విచిత్రంగా ఉంది.