అమరావతి : జగన్ నిందితుడైతే...మరి రామోజీ ఏంటి ?
ఎల్లోమీడియాలో బ్యానర్ స్టోరీ ఒకటి వచ్చింది. అదేమిటంటే రు. ‘5 కోట్ల అప్పు.. రు. 1600 కోట్లకు ముప్పు’ అనే హెడ్డింగ్ తో అచ్చయిన స్టోరీలో ఎప్పుడో జరిగిన లేపాక్షి నాలెడ్జి హబ్ లో ఇంకో దివాలా బాగోతం అంటు రాసింది. స్టోరీ లోతుల్లోకి వెళ్ళటంలేదు కానీ ఎల్లోమీడియా రాసింది ఏమిటంటే లేపాక్షి నాలెడ్జి కుంభకోణానికి ముఖ్యపాత్రదారి నేటి సీఎం జగన్మోహన్ రెడ్డేనట. క్విడ్ ప్రోకోగా డబ్బు దండుకున్నట్లు తేల్చి ఏ1 గా సీబీఐ కేసుపెట్టిందట.
దర్యాప్తుచేసిన సీబీఐ కుంభకోణంలో జగనే లబ్దిదారుడు, మొదటి నిందితుడని తేల్చేసి చార్జిషీటులో పేరుకూడా చేర్చిందట. ఇందూ గ్రూపుకు భూములు కేటాయించినందుకు ఆ సంస్ధ జగన్ కంపెనీల్లో రు. 70 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ తేల్చిందట. సరే సీబీఐ చార్జిషీట్లో చెప్పింది కాబట్టి జగన్ పాత్రదారుడు, నిందితుడనే అనుకుందాం. చార్జిషీట్లలో సీబీఐ అనేకమంది పేర్లను చేరుస్తుంది. కానీ విచారణలో ఆధారాలతో సహా నిరూపితం కావాలి కదా. జగన్ పైన నమోదైన కేసుల్లో ఆధారాలు లేవని ఒక్కోటి కోర్టులు కొట్టేస్తున్నాయి. క్విడ్ ప్రో కో జరిగినట్లు సరైన ఆధారాలు లేవని కోర్టులు కామెంట్ చేసిన విషయం ఎల్లోమీడియాకు తెలీదా ?
జగన్ పైన సీబీఐ కేసులు పెట్టి 14 ఏళ్ళవుతున్నా ఇంతవరకు ఒక్క కేసు కూడా కొలిక్కిరాలేదు. జగన్ పైన పెట్టిన కేసుల్లో ఒక్కటి కూడా నిలవదని న్యాయనిపుణులే చాలాసార్లు చెప్పారు. ఒకవేళ ఎక్కడైనా తప్పుచేసుంటే, ఆధారాలతో సహా విచారణలో నిరూపించి శిక్ష వేయాల్సిందే. ఇక ప్రస్తుత విషయానికి వస్తే మార్గదర్శి చీటింగ్ కేసులో ఛైర్మన్ రామోజీరావును ఏ1గాను ఆయన కోడలు, ఎండీ శైలజను ఏ2గాను సీఐడీ కేసులు నమోదుచేసింది.
వీళ్ళుచేసిన మోసాలకు ఆధారాలు కూడా ఉన్నాయని చెబుతోంది. రు. వెయ్యికోట్ల విలువైన ఆస్తులను జప్తుకూడా చేసింది. ఖాతాదారుల డబ్బులను చిట్టేతర వ్యాపారాలకు మళ్ళించినట్లు సీఐడీ ఆధారాలతో సహా చూపించింది. నిధులు దారిమళ్ళినట్లు విచారణలో మామా, కోడలు అంగీకరించినట్లు తెలుస్తోంది. ఖాతాదారుల డబ్బును తాము ఎగొట్టలేదని రామోజీ తన మీడియాలో రాసుకుంటున్నారే కానీ వ్యాపారం సక్రమమే అని చెప్పుకోవటంలేదు. అందుకనే మార్గదర్శి కేసులపై పోరాటంచేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతు రామోజీ మోసాలన్నీ కోర్టులో దాదాపు నిర్ధారణయినట్లే అని చెబుతున్నారు. సీబీఐ చార్జిషీట్లో పేరుపెడితే జగన్ నిందితుడు. అదే సీఐడీ కేసుపెట్టి ఆధారాలను చూపిస్తున్నా తాను మోసగాడు కాదా ?