అమరావతి : పవన్ ఎటూకాకుండా పోతారా ?

Vijaya


జనసేన అధినేత పవన్ కల్యాణ్ చివరకు ఎవరికీ కాకుండా పోతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. పవన్ వైఖరి కారణంగా మిత్రపక్షం బీజేపీ పట్టించుకోవటంలేదు. ఇదే సమయంలో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న టీడీపీ కూడా పెద్ద విలువ ఇవ్వటంలేదు. దాంతో ఏమిచేయాలో పవన్ క పాలుపోని పరిస్ధితిలో పడిపోతున్నారు. బీజేపీతో మిత్రపక్షంగా ఉంటూనే చంద్రబాబునాయుడుతో భేటీలవుతు, టీడీపీతో పొత్తుపెట్టుకుంటానని పవన్ పదేపదే ప్రకటిస్తున్న  విషయం తెలిసిందే.పవన్ చేష్టలు, ప్రకటనలతో బీజేపీ అగ్రనేతలకు చిర్రెత్తింది. దాంతో అపాయిట్మెంట్ కోసం పవన్ ఎంత ప్రయత్నిస్తున్నా నరేంద్రమోడీ, అమిత్ షా ఏమాత్రం లెక్కచేయటంలేదు. ఢిల్లీలో ఎన్నిరోజులు కూర్చున్నా మోడీ, షా అసలు పట్టించుకోవటమే లేదు. ఇదే సమయంలో చంద్రబాబు అన్నా పవన్ కు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారా అంటే అదీలేదు. ఒకపుడు జనసేనతో పొత్తుకోసం పరితపించిన చంద్రబాబు ఆలోచనల్లో ఇపుడు మార్పు స్పష్టంగా కనబడుతోంది.మొన్నటి మూడు ఎంఎల్ఏ ఎన్నికల గెలుపుతో జనసేన అవసరం పెద్దగా లేదన్నట్లే వ్యవహరిస్తున్నారు. ఒకపుడు ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని పదేపదే చెప్పిన చంద్రబాబు ఇపుడు పొత్తుల గురించి మాట్లాడటమే లేదు. పైగా రాష్ట్రంలో పర్యటనల సందర్భంగా కొంతమంది అభ్యర్ధులను కూడా ప్రకటించేస్తున్నారు. జనసేనతో పొత్తు విషయం ఫైనల్ కాకుండానే చంద్రబాబు ఏకపక్షంగా అభ్యర్ధులను ప్రకటించేస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది.అభ్యర్ధులనే కాదు మహానాడు సందర్భంగా మొదటివిడత మ్యానిఫెస్టోను కూడా ప్రకటించేశారు. తొందరలోనే మరో మ్యానిఫెస్టోను ప్రకటించబోతున్నట్లు చెప్పారు. అంటే అభ్యర్ధుల ప్రకటన, మ్యానిఫెస్టో ప్రకటన కూడా ఏకపక్షంగానే చంద్రబాబు చేసేస్తున్నారు. చివరకు పొత్తులు ఫైనల్ అయితే సీట్ల సంఖ్య, నియోజకవర్గాల గురించి చంద్రబాబుతో పవన్  చర్చించేది ఏముంటుంది ? టీడీపీ మ్యానిఫెస్టోనే పవన్ పాలో అవ్వకతప్పదేమో. ఇదంతా చూస్తుంటే అటు బీజేపీ ఇటు టీడీపీల్లో ఎవరికీ కాకుండా పోతారేమో పవన్ అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చంద్రబాబు దయతలచి పొత్తుకు ఓకే అంటే చాలనేట్లుంది పవన్ పరిస్ధితి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: