అమరావతి : ఎన్నిస్తే అన్నే... మహాభాగ్యం

Vijaya


ఎన్నిస్తే అన్నే మహా భాగ్యమన్నట్లుగా తయారైంది జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరిస్ధితి. తనంతట తానుగానే తన స్ధాయిని పవన్ నేలబారుకు తగ్గించేసుకున్నారు. దాంతో పవన్ కు అసలు వాల్యు లేకుండాపోయింది. ముఖ్యమంత్రి పదవి అడగటానికి తనకు అర్హత లేదని, డిమాండ్ చేసేంత సీన్ తనకు లేదని యుద్ధానికి ముందే ఓటమిని ఒప్పేసుకున్నారు. సో, ముఖ్యమంత్రి అభ్యర్ధి అనే ఆయుధాన్ని కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు స్వచ్చంధంగా ఆయుధాలను వదిలేసినట్లు పవన్ వదిలేసుకున్నారు.



ఇక మిగిలింది ఏమిటంటే పోటీచేసే సీట్లసంఖ్య. ఇదికూడా బేరమాడి సాధించుకునేంత సీన్ పవన్ కు లేదని తేలిపోయింది. ఎందుకంటే మాజీమంత్రి, సీనియర్ తమ్ముడు చింతకాయల అయ్యన్నపాత్రుడు మాట్లాడుతు పోయిన ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లశాతం ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని చెప్పేశారు. పోయిన ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓట్లు 5.53 శాతం. ఆ లెక్కప్రకారం చూస్తే జనసేనకు దక్కబోయే సీట్లు తొమ్మిది మాత్రమే. 



సరే పార్టీ ఓటుబ్యాంకు పెరిగిందని సగటున 25 శాతం అని పవన్ చెప్పారు. కాబట్టి ఈ లెక్కన 175 సీట్లలో 25 శాతం అంటే 43 సీట్లివ్వాలి. నిజంగా చంద్రబాబునాయుడు అన్నిచ్చినా పవన్ ఇబ్బంది పడిపోతారు. ఎందుకంటే పట్టుమని పది నియోజకవర్గాల్లో కూడా గట్టి అభ్యర్ధులు దొరకరు. కాబట్టి  కాస్త అటుఇటుగా 20 సీట్లివ్వచ్చని టీడీపీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు 20 సీట్లిస్తానని చెప్పినా దాన్నే మహాభాగ్యంగా పవన్ స్వీకరించటం తప్ప చేయగలిగేది ఏమీలేదు.



ఎందుకంటే పార్టీ మొత్తాన్ని చంద్రబాబుకు సరెండర్ చేసేశారు కాబట్టి. పార్టీ అధ్యక్షుడు తన అర్హతకు తగ్గట్లే తాను బేరమాడుతానని చెప్పేశారంటే అర్ధమేంటి ? జనసేన ఒరిజినల్ అర్హతైతే 9 సీట్లే. అందుకు 11 సీట్లు అదనంగా ఇస్తానని చంద్రబాబు అంటే దాన్నే మహాభాగ్యమని పవన్ తీసుకుంటారు. కాబట్టి గౌరవం, మర్యాద అన్న డైలాగులంతా ఉట్టిదే అని అర్ధమైపోతోంది. తాజా వైఖరి చూస్తుంటే లాజికల్ గా అయితే పవన్ ఎప్పటికీ సీఎం కాలేడనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి తన అదృష్టం ఎలాగుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: