అమరావతి : అడ్రస్ లేని జనసేన చీఫ్

Vijaya



జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ది అంతా పార్ట్ టైమ్ రాజకీయమే. ఎప్పుడూ సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటు అవకాశం దొరికినపుడు మాత్రమే పార్టీ మీటింగుల్లో తళుక్కుమని మెరుస్తుంటారు. పార్టీ మీటింగుల్లోను లేకపోతే బహిరంగసభల్లోను ఏదేదో మాట్లాడేసి, జగన్మోహన్ రెడ్డి మీద బురదచల్లేసి, పూనకం దిగిపోయిన తర్వాత ఆయాసంతో వేదిక మీదనుండి దిగివెళిపోతారు.



గడచిన పదేళ్ళుగా పవన్ రాజకీయమంతా ఇలాగే సాగిపోతోంది. ఇపుడు విషయం ఏమిటంటే జనాల మధ్యలోకి పవన్ వచ్చి చాలకాలమైంది. అకాల వర్షాలతో వ్యవసాయరంగం బాగా దెబ్బతినేసింది. పండినపంటంతా కళ్ళాల్లోనే ముణిగిపోవటంతో రైతన్నల బాధ వర్ణనాతీతం. ప్రభుత్వపరంగా జగన్మోహన్ రెడ్డి చేసేది చేస్తున్నారు. మరి ప్రతిపక్షాలు ఏమిచేయాలి ? ప్రభుత్వం చేసే సాయానికి అదనపు సాయం ప్రకటించటమో లేకపోతే జనాల్లోకి వెళ్ళి తామున్నామని ధైర్యం నింపటమో చేయాలి కదా ?



చంద్రబాబునాయుడు ఇదే చేస్తున్నారు. సరే దీన్ని అవకాశంగా తీసుకుని ఓవరాయక్షన్ కూడా చేస్తున్నారు. ప్రభుత్వానికి డెడ్ లైన్లు కూడా పెట్టేసి గోలగోల చేసేస్తున్నారు. మరి ఇక్కడే పవన్ ఏమిచేస్తున్నారు ? అనే చర్చ జరుగుతోంది. ప్రశ్నించటానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ ఏమి చేస్తున్నట్లు ? ప్రభుత్వ సాయంలో ఎక్కడైనా లోపాలుంటే వాటిని ప్రభుత్వానికి ఎత్తిచూపాలి కదా ? బాధిత జనాల దగ్గరకు వెళ్ళి ఓదార్చాలి కదా. ఇంతకన్నా ప్రతిపక్షాలు చేయాల్సిన పనులేముంటాయి ?



జనాల్లోకి వెళ్ళటానికి ప్రతిపక్షాలకు ఇంతకుమించిన సమయం, సందర్భం ఏముంటుంది ? జనాల్లోకి వెళ్ళినపుడు ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరంలేదు. నిజంగానే ఎక్కడైనా లోపాలుంటే ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షాలదే. మరి ప్రతిపక్షంగా పవన్ తన బాధ్యతను నెరవేరుస్తున్నట్లేనా ? ఎక్కడో హ్యాపీగా సినిమా షూటింగుల్లో బిజీగా ఉన్నట్లున్నారు. అందుకనే ప్రజల్లో అడ్రస్ కనబడటంలేదు. ఎంతసేపు ట్విట్టర్ ఖాతాలో ప్రభుత్వంపై బురదచల్లేయటం కాదు రెగ్యులర్ గా జనాల్లో తిరుగుతుంటేనే జనాలు కూడా జనసేనను గుర్తిస్తారు. లేకపోతే అంతే సంగతులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: