అమరావతి : వైసీపీ ఎందుకు వెనకబడిందో తెలుసా ?
అంతిమ ఫలితం ఎలాగుంటుందో తెలీదుకానీ తాజా సమాచారం ప్రకారం పట్టభద్రుల నియోజకవర్గం ఎంఎల్సీ ఎన్నికల్లో ఒకదానిలో వైసీపీ ఆధిక్యతలో ఉండగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి చిరంజీవి రావు గెలిచారు. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో వైసీపీ తరపున పోటీచేసిన వెన్నపూస రవీంద్రారెడ్డి టీడీపీ అభ్యర్ధి భూమిరెడ్డి రామ్ గోపాలరెడ్డిపై కొద్దిపాటి మెజారిటితో మాత్రమే ఉన్నారు. ఇప్పటికే తూర్పు రాయలసీమ నియోజకవర్గంలో కూడా టీడీపీ క్లియర్ మెజారిటితో ఉంది.
అంతిమ ఫలితం ఎలాగుంటుందో ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మొదటి ప్రాధాన్యతలో ఎవరికీ గెలుపు దక్కలేదు. కాబట్టి రెండో ప్రాధాన్యత ఓట్లే గెలుపోటములను తేల్చుతాయనటంలో సందేహంలేదు. ఇక్కడే అందరిలోను ఉత్కంఠ పెరిగిపోతోంది. సరే గెలుపోటములను పక్కనపెట్టేస్తే అసలు వైసీపీకి ఇంతటి దుస్ధితి ఎందుకు వచ్చింది ? 151 సీట్లతో అధికారం సంపాదించుకున్నది. తర్వాత జరిగిన స్ధానికసంస్ధల్లో 90 శాతం గెలుచుకున్నది. ఆ తర్వాత జరిగిన మూడు ఉపఎన్నికల్లో కూడా వైసీపీనే గెలిచింది.
మరిపుడు ఎంఎల్సీ గ్రాడ్యుయేట్ కోటా ఎన్నికల్లో మాత్రం ఎందుకని ఎదురీదుతోంది. పశ్చిమ, తూర్పు రాయలసీమ నియోజకవర్గాల్లో అత్యధిక ప్రజాప్రతినిధులు వైసీపీ వాళ్ళే. కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు పరిధిలోకి వచ్చే ఈ నియోజకవర్గంలో 95 శాతం వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. ఇలాంటి జిల్లాల్లో కూడా వైసీపీ వెనకబడిపోయిందంటే అర్ధమేంటి ?
ఏమిటంటే మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, నేతలు సీరియస్ గా తీసుకోలేదని అర్ధమైపోతోంది. ఓటర్లను చేర్పించటం, ఓటర్లను కలవటం, ఓట్లేసేట్లు ఒప్పించటం, అవసరమైన ప్రచారం చేయటం లాంటి విషయాల్లో అధికారపార్టీ బాగా నిర్లక్ష్యం చేసినట్లు పార్టీలోనే చర్చ పెరిగిపోతోంది. అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలాగైనా గెలిచేస్తామన్న ఓవర్ కాన్పిడెన్సే ఇపుడు కొంపముంచేట్లుగా ఉంది. దీనికి అధికారంలో ఉన్న వాళ్ళంతా బాధ్యత వహించాల్సిందే. మొదటినుండి జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం వద్దని, జాగ్రత్తగా ఎలక్షనీరింగ్ చేయమని చెబుతున్నా ఇపుడీ పరిస్ధితి ఎదురైందంటే ఎవరు కారణం ?