అమరావతి : రాజీనామాలు చేస్తే వీళ్ళ పరిస్దితేంటో ?
అధికార వైసీపీలో కొందరు ప్రజాప్రతినిధుల వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. వీళ్ళకు జగన్మోహన్ రెడ్డితో విభేదాలు వచ్చేశాయి. పార్టీలో కంటిన్యు అవటానికి ఇష్టపడటంలేదు. అందుకని పార్టీతో పాటు ప్రభుత్వంపై నిత్యం బురదచల్లేస్తుంటారు. జగన్ను టార్గెట్ చేసుకుని ఆరోపణలు, విమర్శలు చేస్తునే ఉంటారు. ఎప్పుడెప్పుడు పార్టీతో సంబంధాలు తెగిపోతాయా అని ఎదురు చూస్తుంటారు. అయితే పార్టీ ద్వారా వచ్చిన హోదాలను వదులుకోవటానికి మాత్రం సిద్ధంగా లేరు.
ఇప్పుడిదంతా ఎందుకంటే నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి వైఖరి కారణంగానే. జగన్ పై ఆరోపణలు చేశారు. ప్రభుత్వంపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. పార్టీలో తనకు తీరని అవమానాలు ఎదురయ్యాయన్నారు. అందుకనే తాను పార్టీలో ఉండలేకపోతున్నట్లు చెప్పేశారు. నమ్మకం లేనిచోట, అవమానాలు ఎదురవుతున్న పార్టీలో ఇక ఉండబోనని తేల్చేశారు. మరి పార్టీ ద్వారా వచ్చిన ఎంఎల్ఏ హోదాకు రాజీనామా చేస్తారా ? అంటే మాత్రం మాట్లాడటంలేదు. అంటే ఎంఎల్ఏ పదవి కావాలి కానీ పార్టీ మాత్రం వద్దన్నట్లుగా ఉంది వ్యవహారం.
తానుగా రాజీనామా చేయను కానీ పార్టీతోనే సస్పెండ్ చేయించుకోవాలని కోటంరెడ్డి అనుకుంటున్నట్లుగా ఉంది. ఇదే పద్దతి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు, వెంకటగిరి ఎంఎల్ఏ ఆనం రామనారాయణరెడ్డిలో కూడా కనబడుతోంది. వీళ్ళు కూడా ప్రతిరోజు ఏదో విషయాన్ని అడ్డంపెట్టుకుని జగన్ను వ్యక్తిగతంగాను, ప్రభుత్వంపైన బురదచల్లేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రభుత్వం, పార్టీ అంటే ఇష్టంలేనపుడు ఎంపీ, ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేసేయచ్చు కదా అంటే మాత్రం నోరెత్తరు.
రఘురాజు గతంలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటు ప్రకటించారు కానీ తర్వాత ఆ ఊసే ఎత్తటంలేదు. ఎంపీ, ఎంఎల్ఏలుగా రాజీనామాలు చేసి ఉపఎన్నికల్లో పోటీచేసి గెలిచే సత్తా ఉన్నట్లు లేదు. అందుకనే రాజీనామాల విషయం తప్ప మిగిలిన అన్నీ విషయాలు మాట్లాడుతుంటారు. ఇప్పటికిప్పుడు వీళ్ళు గనుక తమ పదవులకు రాజీనామాలు చేసి ఉపఎన్నికల్లో పోటీచేస్తే అసలు బండారం బయటపడుతుంది. ఉపఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా పోటీచేస్తారా ? లేకపోతే ఏదైనా పార్టీల్లో చేరి పోటీచేస్తారా అన్నది తేలిపోతుంది.