అమరావతి : పవన్ చివరకు త్యాగరాజుగా మిగిలిపోవాల్సిందేనా ?

Vijaya


వచ్చేఎన్నికల్లో అందరు సమిష్టిగా కృషిచేసి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీని గెలిపించాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పిలుపిచ్చారు. నియోజకవర్గాల పరిశీలకులతో అచ్చెన్న మీటింగ్ పెట్టారు. ఈ సందర్భంగా అచ్చెన్న, ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రయాదవ్ మాట్లాడుతు చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిని చేయటమే లక్ష్యంగా అందరు కష్టపడాలన్నారు. చంద్రబాబు సీఎం అవటం పార్టీకి, రాష్ట్రానికి చాలా అవసరమని వీళ్ళద్దరు నొక్కిచెప్పారు.



వీళ్ళిద్దరు చెప్పింది వినటానికి బాగానే ఉంది. అయితే ఇక్కడే ఒక ప్రశ్న మొదలైంది. చంద్రబాబు సీఎం అయితే మరి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాటేమిటి ? అని. పవన్ కూడా తాను ముఖ్యమంత్రి అయిపోదామనే అనుకుంటున్నారు. ఎక్కడ సభ పెట్టినా జనాలంతా తనను సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్లే చెప్పుకుంటున్నారు. జనసేనను గెలిపించి తనను ముఖ్యమంత్రిని చేయమని జనాలకు విజ్ఞప్తి చేసిన విషయం అందరికీ తెలిసిందే.



తనకు జనాలు ఓట్లేస్తారా ? పార్టీకి ఓట్లేసి గెలిపిస్తారా ? అన్న గ్రౌండ్ లెవల్ రియాలిటీతో పవన్ కు పనిలేదు. వచ్చేఎన్నికల్లో తాను సీఎం అయిపోతున్నాను అన్న ఒక్కపాయింట్ నే పవన్ గట్టిగా పట్టుకున్నారు. మొన్నటి రణస్ధలం సభలో మాట్లాడుతు టీడీపీతో పొత్తుంటుందని ప్రకటించేశారు. అదికూడా గౌరవ, మర్యాదలకు భంగం కలగకుండా ఉంటేనే పొత్తని ఒక ట్యాగ్ లైన్ తగిలించారు. మరా గౌరవ, మర్యాదలంటే ఏమిటో పవన్ కే తెలియాలి. ఇదంతా ఓకే, అయితే చంద్రబాబు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండాలని అచ్చెన్న, బీద స్పష్టంగా తమ నేతలకు చెప్పారు. అసలు చంద్రబాబు పోరాటమంతా ముఖ్యమంత్రి అవ్వాలనే అన్న విషయం అందరికీ తెలుసిందే.



ఆదే నిజమైతే మరప్పుడు పవన్ పరిస్ధితి ఏమిటి ?  సీఎం అవ్వాలనే పవన్ కోరిక చివరకు కోరికగా మాత్రమే మిగిలిపోతుందా ? చంద్రబాబుతో పొత్తున్నంత కాలం సీఎం అవ్వాలన్న  పవన్ కోరిక తీరే అవకాశం లేనట్లేనా ? టీడీపీతో పొత్తంటే వాస్తవం కూడా ఇదే అని మామూలు జనాలకు కూడా బాగా తెలుసు. మరి తన స్ధానమేంటో పవనే తెలుసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: