రాయలసీమ: రోజాకు ఇబ్బందులు తప్పవా ?
దారినపోయే చెత్తను నెత్తిన వేసుకోవటం అంటే ఏమిటో మంత్రి రోజాను అడిగితే బాగా చెబుతారు. మెగాబ్రదర్స్ అంటు చిరంజీవి, పవన్ కల్యాణ్ , నాగబాబును కలిపి చేసిన కామెంట్లు ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. మెగా అభిమానుల్లో ఇదే విషయమై చాలామంది రోజాపై మండిపోతున్నారు. వచ్చేఎన్నికల్లో రోజాను ఓడించటానికి మెగా అభిమానులందరు గట్టిగా పనిచేయాలని తిరుపతి, చిత్తూరులో సమావేశాలు పెట్టుకుని మరీ తీర్మానించారు.
సమస్య ఎక్కడ వచ్చిందంటే మోగా బ్రదర్స్ పై రోజా నోటికొచ్చింది మాట్లాడారు. ముఖ్యంగా చిరంజీవిపై బాగా నోరుపారేసుకున్నారు. రోజా మాట్లాడుతు మెగా అభిమానులు తమను అభిమానించిన ప్రేక్షకులకు కానీ లేదా ప్రజలకు కానీ తమ సంపాదనలో ఒక్కరూపాయి కూడా ఏరోజు ఖర్చుపెట్టలేదన్నారు. చివరకు తమ ప్రాంతానికి కూడా ఏమీ చేయలేదన్నారు. అందుకనే చిరంజీవితో పాటు నాగబాబు, పవన్ కూడా తమ ప్రాంతాల్లో ఓడిపోయినట్లు రెచ్చిపోయారు. అంతేకాకుండా వీళ్ళముగ్గురికి రాజకీయ భవిష్యత్తు లేదని తేల్చేశారు.
ఇక్కడ రోజా గమనించాల్సిందేమంటే ఎన్నికల్లో గెలుపోటములకు అనేక కారణాలుంటాయి. చిరంజీవి పాలకొల్లులో, నాగబాబు నరసాపురంలో, పవన్ భీమవరం, గాజువాకలో ఓడిపోయుండచ్చు. అంతమాత్రాన వాళ్ళు రాజకీయాలకు పనికిరారనటం తప్పు. ఆమాటకొస్తే రోజా కూడా నగిరి, చంద్రగిరిలో మొదటి రెండు ఎన్నికల్లో ఓడిపోలేదా. ఇందుకే కదా రోజాపై ఐరన్ లెగ్ అనే ముద్రపడింది. ఇక తమ ప్రాంతాలకు ఒక్కరూపాయి కూడా ఖర్చు పెట్టలేదని చెప్పాల్సిన అవసరంలేదు.
ఎందుకంటే ఖర్చుపెట్టడం, ఖర్చు పెట్టకపోవటం వాళ్ళిష్టం. ఇక్కడ విషయం ఏమిటంటే పవన్, నాగబాబు అంటే యాక్టివ్ గా ఉన్నారు కాబట్టి ఏమన్నా చెల్లుబాటైపోతుంది. కానీ చిరంజీవి మీద ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? చిరంజీవి ఏరోజూ రోజా గురించి ఒక్కమాట కూడా అనలేదు. ఇపుడు మెగా బ్రదర్సని చిరంజీవిని కూడా కలిపి రోజా రెచ్చిపోవటంతో అభిమానసంఘాలు మండిపోతున్నాయి. అసలే నగిరిలో వచ్చేఎన్నికల్లో రోజా గెలిచేది అనుమానం. రోజాకు పార్టీలోనే బలమైన ప్రత్యర్ధివర్గం తయారైంది. వీళ్ళతో సర్దుబాటు చేసుకోవాల్సిన రోజా కొత్తగా శతృవులను తయారుచేసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.