హైదరాబాద్ : రెండుకళ్ళ సిద్ధాంతమే పూర్తిగా ముంచేస్తుందా ?

Vijaya



చూడబోతే చంద్రబాబునాయుడు రెండుకళ్ళ సిద్ధాంతమే తెలుగుదేశంపార్టీని సాంతం ముంచేసేట్లుంది. ఈ సిద్ధాంతంతోనే రాష్ట్ర విభజన ద్వారా తెలంగాణాలో పార్టీని చంద్రబాబే నాశనం చేసుకున్నారు. ఇపుడు ఇదే సూత్రం ఏపీలో కూడా అప్లై చేద్దామని అనుకున్నట్లున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాష్ట్రవిభజనకు ముందు అప్పటి యూపీఏ ప్రభుత్వం విభజనపై చంద్రబాబు అభిప్రాయం అడిగింది. అప్పుడు చంద్రబాబు రాష్ట్ర విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు తెలంగాణా, ఏపీ తనకు రెండు కళ్ళలాంటివని ప్రకటించారు.





తర్వాత జరిగిన పరిణామాల్లో స్వయంకృతం వల్ల తెలంగాణా అనే ఒక కన్నును కోల్పోయారు. అప్పటినుండి తన రాజకీయం మొత్తాన్ని ఏపీకే పరిమితంచేశారు. అలాంటిది 2023 ఎన్నికలు వస్తున్న నేపధ్యంలో మళ్ళీ తెలంగాణాలో క్రియాశీలం కావాలని అనుకుంటున్నారు. ఇక్కడే చంద్రబాబు వ్యూహాలపై రెండురకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మొదటిదేమో తెలంగాణాలో టీడీపీకి బలముందని షో చేసి బీజేపీని దారికి తెచ్చుకుని  ఏపీలో కూడా పొత్తు పెట్టుకోవటం.





రెండో ప్రచారం ఏమిటంటే తెలంగాణాలో బాగా యాక్టివ్ అయిపోయి ఒంటరిగా పోటీచేసైనా ఎన్నోకొన్ని సీట్లు గెలుచుకుని మళ్ళీ చక్రంతిప్పటం. చంద్రబాబు వ్యూహాలు ఇవే అయితే నిజానికి రెండూ వర్కవుట్ కావు. ఎందుకంటే తెలంగాణాలో టీడీపీ దాదాపు భూస్ధాపితమైపోయింది. దాన్ని తట్టి లేపుదామని చూస్తే ఏపీలో కూడా తెలంగాణా పరిస్ధితి తప్పదు. ఇప్పటికే టీడీపీ దెబ్బతినేసింది. అందుకనే పొత్తులుంటే తప్ప మనుగడ సాధ్యంకాదనే స్ధితికి చంద్రబాబు చేరుకున్నారు.





జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోవటం సాధ్యంకాదని అర్ధమైపోయే జనసేన, బీజేపీతో పొత్తుకు వెంపర్లాడుతున్నారు. చేసే ప్రయత్నాలేవో ఏపీలో చేసుకోకుండా అనవసరంగా తెలంగాణాలో ఏదో చేద్దామని అనుకుంటే రెండో కన్ను ఏపీ కూడా శాశ్వతంగా మూసుకుపోయే ప్రమాదముంది. అప్పుడు చేతులారా చంద్రబాబే రెండుకళ్ళను పోగొట్టుకున్నట్లవుతుంది. ఒకసారి తెలంగాణాలో తమ్ముళ్ళని ముంచేశారు. ఇపుడు ఏపీలో తమ్ముళ్ళని కూడా ముంచేయటానికి రెడీ అవుతున్నారు. ఇదే జరిగితే ఇక ఎవరూ చేసేదేమీలేదు టీడీపీ చరిత్రలో మాత్రమే మిగిలుంటుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: