అమరావతి : అధ్యక్షుడిని మారిస్తే రాతమారుతుందా ?

Vijaya






ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా  గిడుగు రుద్రరాజును అధిష్టానం నియమించింది. ఇప్పటివరకు అద్యక్షుడిగా ఉన్న డాక్టర్ సాకే శైలజానాద్ ను చెప్పాపెట్టుకుండా మార్చేయటం ఆశ్చర్యంగా ఉంది. సరే ప్రెసిడెంట్ గా  శైలజానాద్ ఉన్నా రుద్రరాజు ఉన్నా పార్టీకి ఒరిగేదేమీలేదు. ఎందుకంటే పార్టీలో జనబలమున్న నేతలు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా లేరు. కొత్త అధ్యక్షుడు రుద్రరాజు కూడా జనాల్లో చాలామందికి తెలీదనే చెప్పాలి. ఎప్పుడో ఎంఎల్సీగా పనిచేసిన వ్యక్తిని అధిష్టానం హఠాత్తుగా అధ్యక్షుడిని చేసేసింది.



పచ్చగా కళకళలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి స్వయంగా అధిష్టానమే గొయ్యితవ్వేసుకుంది. ఎంతోబలంగా ఉన్న పార్టీని రాష్ట్ర విభజన ద్వారా నేలమట్టం చేసేసుకున్నది. అప్పటినుండి పార్టీకి రెండురాష్ట్రాల్లోను దరిద్రం పట్టుకున్నదనే చెప్పాలి. ప్రత్యేకరాష్ట్రం ఇచ్చి తెలంగాణాలో లాభపడిందేమీలేదు. ఇదే సమయంలో ఏపీలో భూస్ధాపితమైపోయింది. తెలంగాణాలో అయినా ఏదో నాలుగు చోట్ల గెలుస్తోందికానీ ఏపీలో అయితే 175 నియోజకవర్గాల్లో ఒక్కదాంట్లో కూడా కనీసం డిపాజిట్లు కూడా తెచ్చుకోలేకపోతోంది. రాబోయే ఎన్నికలో కూడా దాదాపు ఇదే పరిస్దితి ఉంటుందేమో. 



వరుసగా 2014, 19 ఎన్నికల్లో వచ్చిన ఓట్లను చూస్తే తెలిసిపోతుంది పార్టీ పరిస్ధితి ఎలాగుందో. ఇలాంటి పార్టీకి అధ్యక్షుడిగా ఎవరున్నా ఒకటే. కొత్తగా సమన్వయకమిటి, రాజకీయ వ్యవహారాల కమిటిలో నియమితులైన నేతల్లో అత్యధికులకు జనబలం లేదు. కిరణ్ కుమార్ రెడ్డి, చింతామోహన్, హర్షకుమార్, తులసిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, పళ్ళంరాజు లాంటి నేతలు ఎంతమందున్నా పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ చేసేది కూడా ఏమీలేదనే చెప్పాలి. ఎందుకంటే ఉన్న వారిలోనే అధిష్టానం ఎవరో ఒకరిని వెతుక్కోవాలి.



ఇపుడు పార్టీ సమస్య ఏమిటంటే కొత్త అధ్యక్షుడు రుద్రరాజు నాయకత్వంలో అయినా వచ్చే ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్ధులకు డిపాజిట్లు దక్కుతాయా అని. అమలాపురంకు చెందిన రుద్రరాజే రాష్ట్రంలోని జనాల్లో చాలామంది తెలీదు. ఇక మిగిలిన నేతలగురించి చెప్పుకునేందుకు ఏమీలేదు. మొత్తానికి అధ్యక్షుడిని మారిస్తే అన్నా పార్టీ రాత మారుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: