అమరావతి : జనసేనలో అయోమయం పెరిగిపోతోందా ?

Vijaya



ప్రభుత్వ వ్యతిరేకఓట్లు చీలకుండా ఉండేందుకు జనసేన ఒక ప్రణాళిక ప్రకారం ముందుకెళుతోందట. అలాగని పార్టీ రాజకీయవ్యవహారాల కమిటి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చెప్పారు. జనసేనకు ఒక ప్రణాళికుందని, దాని ప్రకారమే పార్టీ నడుచుకుంటుందని నాదెండ్ల చెబితే నమ్మేంత అమాయకులు కారు జనాలు. వైసీపీ విముక్త ఏపీ కోసం అన్నీ పార్టీలు కలిసి పోరాడాల్సిన అవసరాన్ని నాదెండ్ల గుర్తుచేశారు. తమపార్టీకి ఒక ప్రణాళికుందని ఆ ప్రణాళిక ప్రకారమే నడుచుకుంటుందని నాదెండ్ల చెప్పటమే చాలా విచిత్రంగా ఉంది.



ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా జనసేన ఎలాంటి ప్రణాళికను అనుసరిస్తోందో చెప్పమంటే నాదెండ్ల చెప్పలేకపోయారు. మరలాంటపుడు తాము ప్రణాళిక ప్రకారమే ముందుకెళతామని చెబితే జనాలు ఎలానమ్ముతారు ? పైగా వైసీపీ విముక్త ఏపీ కోసం అన్నీపార్టీలు కలిసి పోరాడాలని పిలుపివ్వటమే విచిత్రంగా ఉంది. రాబోయే ఎన్నికలకు సంబంధించి జనసేన ఎవరితో పొత్తుపెట్టుకుంటుంది ? లేకపోతే ఒంటరిపోరాటం చేస్తుందా అన్న విషయాన్నే ధైర్యంగా ప్రకటించలేకపోతోంది. ఏదో సొల్లు చెబుతు కాలాన్ని నెట్టుకొస్తున్నారు. 



ప్రజాస్వామ్య పరిరక్షణకోసం చంద్రబాబునాయుడుతో కలిసి పోరాటాలు చేస్తామని పవన్ కల్యాణ్ చెప్పిన వారంరోజులకే టీడీపీతో కటీఫ్ చెప్పేశారు. విశాఖపట్నం పర్యటన సందర్భంగా నరేంద్రమోడీతో భేటీ అయిన తర్వాత పవన్ ఎందుకనో టీడీపీకి దూరంగా ఉంటున్నారు. చంద్రబాబుతో కలవటానికి బీజేపీ ఇష్టపడటంలేదు. ఇదే సమయంలో బీజేపీని వదిలేసి టీడీపీతో చేతులు కలిపేంత ధైర్యం పవన్ చేయలేకపోతున్నారు. పోనీ బీజేపీతో మనస్పూర్తిగా కలుస్తున్నారా అంటే అదీలేదు.




క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాల్లో ఇప్పటి అంచనాల ప్రకారం బీజేపీ+జనసేనలు కలిసి పోటీచేస్తాయి. లేదా జనసేన ఒంటరిగానే పోటీచేస్తుంది. ఇదే సమయంలో టీడీపీ ఒంటరిగానో లేకపోతే కాంగ్రెస్, వామపక్షాలతో కలిసో ఎన్నికల్లో దిగుతుంది. పార్టీల మధ్య ఇన్ని కాంబినేషన్లు కనిపిస్తున్నపుడు ఇక ప్రభుత్వ వ్యతిరేకఓట్లను చీలనిచ్చేది లేదని నాదెండ్ల ఎలా చెబుతున్నారు ? పైగా తమ దగ్గర ఒక ప్రణాళికుందని జనాలు నమ్మాలట, మరి జనాలు నమ్ముతారా ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: