రాయలసీమ : హిందుపురమే ఎందుకు వివాదాల్లో కూరుకుపోతోంది ?

Vijaya






రాష్ట్రంలో ఇన్ని నియోజకవర్గాలుండగా ఒక్క హిందుపురం అసెంబ్లీ నియోజకవర్గమే ఎందుకు వివాదాల్లో కూరుకుపోతోందో అర్ధంకావటంలేదు. పార్టీలతో సంబంధంలేకుండా వివాదాల్లో ముణగిపోతుండటమే ఆశ్చర్యంగా ఉంది. వైసీపీ ఎంఎల్సీ మొహమ్మద్ ఇక్బాల్ పీఏ గోపీకృష్ణ హత్యకేసులో ఇరుక్కోవటమే సంచలనంగా మారింది. హత్యకేసు కూడా మామూలుది కాదు సొంతపార్టీ నేత, నియోజకవర్గం సమన్వయకర్త చౌళూరి రామకృష్ణారెడ్డి హత్యకేసులో ఇరుక్కున్నాడు. ఒకపార్టీ నేతలు మరోపార్టీ నేతలపై దాడులు చేయటం చాలా మామూలు.



ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలయమైన ప్రాంతాల్లో దాడులు, ప్రతిదాడులు చాలా సహజంగానే జరుగుతుంటాయి. కానీ సొంతపార్టీ నేతనే హత్య చేయించటం మామూలు విషయంకాదు. అందునా హత్యకేసులో ఎంఎల్సీ పీఏనే  కీలకంగా మారటమే ఆశ్చర్యంగా ఉంది. ఎంఎల్సీ తరపున పీఏనే నియోజకవర్గంలో అన్నీ వ్యవహారాలను చక్కబెట్టేస్తున్నారనే ఆరోపణలకు కొదవేలేదు. సమస్త పంచాయితీలు ఎంఎల్సీ తరపున పీఏనే ఫైనల్ చేసేస్తున్నాడట.



ఇలాంటి ఆరోపణలే ఒకపుడు నందమూరి బాలకృష్ణ విషయంలో కూడా వినిపించాయి. టీడీపీ అధికారంలో ఉన్నపుడు హిందుపురంలో బాలయ్య పీఏగా పనిచేసిన శేఖర్ డిఫాక్టో ఎంఎల్ఏగా ఉండేవాడు. బాలయ్య అనుమతి లేకుండా కలెక్టర్, ఎస్పీలు కూడా నియోజకవర్గంలోకి వచ్చేవారు కాదు. అప్పట్లో నియోజకవర్గంలో జరిగే ప్రతి పంచాయితిని శేఖరే చేసేవాడు. రోడ్డు కాంట్రాక్టులు, ఇరిగేషన్ కాంట్రాక్టులు ఇలా సమస్తం పీఏనే సెటిల్ చేసేవాడు. ఏపీ గోలను తట్టుకోలేక నేతలు ధర్నాలు కూడా చేశారు. ఇదే విషయాన్ని  చంద్రబాబునాయుడుకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం కనబడలేదు. దాంతో ఏపీ ఆధిపత్యాన్ని తట్టుకోలేక నేతలంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. 



హిందుపార్టీలో ముసలం పుట్టేట్లుందని చంద్రబాబు భయపడి వెంటనే బాలయ్యను పిలిపించుకుని మాట్లాడి బలవంతంగా శేఖర్ ను  ఏపీగా తప్పించారు. అప్పట్లో శేఖర్ అయినా ఇపుడు గోపీ అయినా చాలా వివాదాస్పదమవ్వటమే విచిత్రంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిందేమంటే  మంత్రులు, మిగిలిన ఎంఎల్ఏలకు కూడా పీఏలున్నారు. వీరిలో ఎవరి పీఏలపైనా కూడా ఇంతస్ధాయిలో ఆరోపణలు లేవు. మరి హిందుపురంలో పనిచేసిన పీఏలు మాత్రమే ఇంతగా ఎందుకు ఇంతగా  వివాదాస్పదమవుతున్నారో అర్ధంకావటంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: