అమరావతి : టీడీపీతో జనసేన కలవటంలేదా ?

Vijaya






ఉమ్మడి ప్రకటనచేసి పదిరోజులు కూడా కాలేదు అప్పుడే టీడీపీ ఒంటరిపోరాటానికి దిగేసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము కలిసి పోరాటాలు చేయబోతున్నట్లు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. వైజాగ్ ఎపిసోడ్ తర్వాత హడావుడిగా పవన్ విశాఖ నుండి విజయవాడ చేరుకున్నారు. అక్కడ పార్టీ సమావేశంలో మాట్లాడారు. తర్వాత కొద్దిసేపటికే చంద్రబాబు వచ్చి భేటీఅయ్యారు.



నాటకీయఫక్కీలో జరిగిపోయిన ఘటనల్లోనే తామిద్దరం కలిసి పోరాటాలు చేయబోతున్నట్లు ఇద్దరు మీడియాముందు  ప్రకటించారు. సీన్ కట్ చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం టీడీపీ నేతృత్వంలో ప్రజాపోరు మొదలైంది. ఈ పోరాటంలో జనసేన ఊసేలేదు. రాష్ట్రంలోని కీలక ప్రాంతాలైన విశాఖపట్నం, విజయవాడ లాంటిచోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చారంతే. ఎక్కడకూడా జనసేన నేతలు, కార్యకర్తలు కనబడలేదు.



ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న టీడీపీకి కలవాలని ఇంతవరకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాళ్ళ నేతలు, కార్యకర్తలకు చెప్పనేలేదు. కాబట్టి ఆ పార్టీనేతలు కూడా క్షేత్రస్ధాయిలో ఎక్కడా కనబడలేదు. ఇంతకీ రెండుపార్టీలు ఉమ్మడిపోరాటాలు ఎందుకు మొదలుపెట్టలేదు ? ఎందుకంటే ఏ రూపంలో కూడా చంద్రబాబు, పవన్ చేతులుకలపటం రెండుపార్టీల్లోని నేతలకు ఏమాత్రం ఇష్టంలేదు. ఇదే విషయాన్ని రెండుపార్టీల్లోని నేతలు తమ అధినేతలకు స్పష్టంగా చెప్పారు. టీడీపీతో చేతులు కలపటం వల్ల జనసేనకు జరగబోయే నష్టాన్ని కొందరు నేతలు పవన్ కు వివరించి చెప్పారు.



ఇందులో భాగంగానే ఐక్యపోరాటాలు చేయానే విషయంలో పవన్ కాస్త వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఈనెల 30వ తేదీన పార్టీ ఆఫీసులో రాజకీయ వ్యవహారాల కమిటి నేతలతో భేటీ జరగబోతోంది. ఆరోజు ఐక్యపోరాటల విషయంలో స్పష్టమైన వైఖరి తీసుకునే అవకాశముందని అంటున్నారు. కలిసి పోరాటాలు చేయటానికే ఇష్టపడని రెండుపార్టీల నేతలు రేపటి ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంటే ఇంకెలా కలిసి పోటీచేస్తారు ? ఇప్పటికే రెండుపార్టీల మద్య పొత్తు వర్కవుట్ కాదనే ప్రచారం బాగా జరుగుతోంది. మరి 30వ తేదీన పవన్ ఏం  నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.  






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: