అమరావతి : చంద్రబాబు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నారా ?

Vijaya



అవును చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఈ విషయంలో చంద్రబాబే కాదు మిగిలిన ప్రతిపక్షాలు కూడా ఫెయిలవుతున్నాయనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి మూడేళ్ళ  పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని, అరాచకాలు, అవినీతి పెరిగిపోయిందని చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా కూడా నానా గోలచేస్తున్నది. జగన్ హయాంలో అభివృద్ధి పూర్తిగా పాతాళానికి పడిపోయిందని నానా రచ్చ చేస్తున్నారు.



ఇవే ఆరోపణల ఆధారంగా జగన్ను పిలిచో లేకపోతే మంత్రులు, వైసీపీ నేతలను పిలిపించో చంద్రబాబు అండ్ కో జనాల్లోనే డిబేట్లు ఎందుకు పెట్టకూడదు. మ్యానిఫెస్టోలో జగన్ ఇచ్చిన హామీలేమిటి ? అమలు చేస్తున్నదేమిటి ? అనే విషయాలపైన జనాల్లో చైతన్యం ఎందుకు తీసుకురాకూడదు ? తానిచ్చిన హామీల్లో 95 శాతం అమలు చేసినట్లు జగన్ పదే పదే చెబుతున్నారు. జగన్ చెబుతున్నది తప్పని ప్రతిపక్షాలు నిరూపించే అవకాశాన్ని ఎందుకని పోగొట్టుకుంటున్నాయి.



ప్రభుత్వం పనితీరు ఏ విధంగా అధ్వాన్నంగా ఉంది ? జగన్ విధానాలు రాష్ట్రానికి ఏ విధంగా నష్టం చేస్తాయనే విషయాన్ని ఉదాహరణలతో సహా జనాలకు వివరించవచ్చుకదా. తన పాలనలో రాష్ట్రం అన్నీ విధాలుగా అభివృద్ధిపథంలో దూసుకుపోతే ఇపుడు అదంతా నాశనమైపోందని చంద్రబాబు పదే పదే మీడియాలో చెబుతున్నారు. తాను చెబుతున్నదాన్నే మీడియాలో కాకుండా డైరెక్టుగా జనాల మధ్యలోకే వెళ్ళి వైసీపీ నేతలను నిలదీయచ్చుకదా.



క్షేత్రస్ధాయిలోకి వెళ్ళి జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తిచూపితే జనాలు చంద్రబాబు  వాదనలతో ఏకీభవిస్తే వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధించటం టీడీపీకి తేలికవుతుంది. ప్రజల మనసులను గెలుచుకుని అధికారంలోకి రావాలని అనుకోవటంలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డిపైన జనాల్లో వ్యతిరేకత ఉందని ఆ వ్యతిరేకతే తమను వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తుందనే పిచ్చి భ్రమల్లో ఉన్నారు. ఈ భ్రమల్లోనుండి బయటకు రాకపోతే మళ్ళీ 2019 ఎన్నికల రిజల్ట్సే రిపీట్ కావటం ఖాయం. ప్రభుత్వాన్ని లాజికల్ గా ఎండగట్టే గోల్డెన్ ఛాన్స్ ను చంద్రబాబు అండ్ కో మిస్ చేసుకుంటుండటమే ఆశ్చర్యంగా ఉంది.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: