అమరావతి : లోకేష్ కు ఈ ఆనందం కూడా మిగల్చరా ?
చివరకు నారా లోకేష్ కు వైసీపీ వాళ్ళు ఈ ఆనందాన్ని కూడా మిగిల్చేట్లులేరు. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను, వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ ఏ స్ధాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇంతకీ లోకేష్ చేస్తున్న దాడంతా ఎక్కడనుండి అంటే ట్విట్టర్, జూమ్ మీటింగుల్లోనే ఎక్కువ. ఎక్కడికైనా వెళ్ళినపుడు అక్కడ మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా టార్గెట్ మాత్రం జగనే.
ఈ నేపధ్యంలోనే 10వ తరగతిలో ఫెయిలైన విద్యార్ధులను, వాళ్ళ తల్లిదండ్రులను ప్రభుత్వంపైకి రెచ్చగొట్టడానికి జూమ్ మీటింగ్ పెట్టుకున్నారు. దానిలోకి హఠాత్తుగా కొడాలినాని, వల్లభనేని వంశీ ప్రత్యక్షమయ్యారు. దాంతో ముందు షాక్ తిన్న లోకేష్ తర్వాత వాళ్ళని మ్యూట్ చేసి ఆ తర్వాత ఏకంగా మీటింగ్ నుండి ఎగ్జిట్ అయిపోయారు. ఆ తర్వాత ట్విట్టర్ వేదికగా చాలా చాలెంజులే చేశారు. సరిగ్గా ఇక్కడే వైసీపీ ఎంపి విజయసాయరెడ్డి సీన్లోకి ఎంటరయ్యారు.
జూమ్ మీటింగులు పెట్టుకుని ముఖ్యమంత్రిపై ఎలాపడితే అలా మాట్లాడితే ఊరుకునేదిలేదన్నారు. జూమ్ మీటింగులోకి కొడాలి, వంశీ ప్రత్యక్షమవ్వటం ఆరంభం మాత్రమే అని హెచ్చరించారు. అంటే ఇకనుండి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఓపెన్ టు ఆల్ అన్నపద్దతిలో జూమ్ మీటింగ్ పెట్టినా, పరిమితమైన వాళ్ళతో మాత్రమే మీటింగ్ పెట్టినా కచ్చితంగా తాము ఎంటర్ అవుతామన్నట్లుగా ఉంది విజయసాయి హెచ్చరిక.
ప్రతిసారి లోకేష్ మీటింగులోకి వైసీపీ నేతలు ఇలాగే ప్రత్యక్షమైతే ఇక లోకేష్ ఏమి మాట్లాడగలరు ? జగన్ పై బురదచల్లటమంటే లోకేష్ కు ఎంతకష్టం ? జగన్ పై జూమ్ మీటింగులో కూడా బురదచల్లనీయకపోతే ఎలాగన్నదే ఇపుడు పాయింట్. జూమ్ మీటింగులో జగన్‌ను అమ్మనాబూతులు తిట్టేస్తు, పిచ్చిపిచ్చి చాలెంజులు చేస్తు లోకేష్ ఆనందపడిపోతున్నారు. విజయసాయి వార్నింగ్ చూసిన తర్వాత లోకేష్ కు ఈ చిన్న ఆనందాన్ని కూడా మిగిల్చేట్లు లేరనే అనిపిస్తోంది. మరి దీనికి ఎండ్ కార్డు పడేదెప్పుడు ? లోకేష్‌లో ఆనందం చిగురించేదెప్పుడో ?