అమరావతి : మిత్రుడే ఎదురుతిరగటంతో చంద్రబాబుకు షాక్ ?
నమ్మకమైన మిత్రుడు, అవసరంలో ఆదుకుంటాడని అనుకున్న మిత్రుడే ఎదురుతిరగటంతో చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ కొట్టినట్లయ్యింది. తానిక పల్లకీ మోసేదిలేదని, త్యాగాలు చేసేదిలేదని కాబట్టి తానే పల్లకిలో కూర్చుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పవన్ మోసే పల్లకిలో, చేసే త్యాగాలపైన వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేసి ముఖ్యమంత్రి అయిపోదామని చంద్రబాబు ఎన్నో ఆశల్లో ఊగిపోతున్నారు.
అలాంటి పవన్ హఠాత్తుగా రివర్సు అయిపోవటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోవాలంటే తనను ముందు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించాల్సిందే అని పవన్ షరతు విదించిన విషయం తెలిసిందే. ఇదే సందర్భంగా తనకు మూడు ఆప్షన్లు ఉన్నట్లు పవన్ చేసిన ప్రకటన చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళల్లో పెద్ద అలజడినే రేపింది. తాను ఎప్పుడు పిలిచినా వచ్చి తన ప్రయోజనాలకోసం పవన్ కష్టపడతాడని ఇంతకాలం చంద్రబాబు చాలా హ్యాపీగా ఉన్నారు. తాజాగా మారిన పవన్ ధోరణిని తట్టుకోలేకపోతున్నారు.
అలాంటిది ఎన్నికల హీట్ పెరిగిపోతున్న సమయంచూసి కరెక్టుగా పవన్ కొట్టిన దెబ్బతో చంద్రబాబు, తమ్ముళ్ళు గిలగిల్లాడిపోతున్నారు. పవన్ ద్వారా బీజేపీని కూడా దారిలోకి రప్పించుకోవాలనేది చంద్రబాబు ప్లాన్. కానీ బీజేపీ సంగతి దేవుడెరుగు అసలు నమ్మకమైన మిత్రుడని అనుకున్న పవనే ఎదురుతిరగటం ఏమిటనేది ఎవరికీ అంతుబట్టడంలేదు. జనసేన+టీడీపీ పొత్తుపెట్టుకుంటే అధికారంలోకి వస్తుందా లేదా అన్నది అప్రస్తుతం.
పొత్తు పెట్టుకుంటే పరిస్ధితి ఎలాగుంటుందో తెలీదుకానీ విడివిడిగా పోటీచేస్తే మాత్రం చంద్రబాబుకు ఇబ్బందులు తప్పవన్నది వాస్తవం. వచ్చే ఎన్నికలే చంద్రబాబు, టీడీపీ భవిష్యత్తుకు జీవన్మరణ సమస్య. టీడీపీ అధికారంలోకి రాకపోతే అంతే సంగతులు. జనసేన విషయం తీసుకుంటే ఓడిపోయినా పవన్ కు పోయేదేమీలేదు. అలాగే బీజేపీకి కూడా కొత్తగా వచ్చే సమస్యేమీలేదు. ఎటొచ్చి దెబ్బపడేది చంద్రబాబు మీదే అన్నది ఫుల్లు క్లారిటితో ఉన్నారు. కాబట్టే పవన్ నుండి ఎదురైనా ధిక్కారణ ధోరణిని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.