అమరావతి : ఆ ఒక్క తప్పే జగన్ను వెంటాడుతోందా ?

Vijaya



ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్క తప్పే ఇంకా వెంటాడుతోంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల నేతలు కొందరు కలిశారు. తాము సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పుకున్నారు.  పెన్షన్ విషయంలో ఆ విధానాన్ని రద్దుచేసి ఓపీఎస్(ఓల్డ్ పెన్షన్ స్కీం)నే పునరుద్ధరించాలని రిక్వెస్టు చేసుకున్నారు. జగన్ కూడా ముందు వెనకా ఆలోచించకుండా వెంటనే ఓకే చెప్పేశారు.



అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ పద్దతిని రద్దు చేస్తానని ఆర్భాటంగా ప్రకటించేశారు. అప్పుడు చేసిన ఆ హామీ, ప్రకటనే ఇపుడు జగన్ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. సాంకేతిక సమస్యలు తెలుసుకోకుండా, ఆలోచించకుండా అప్పట్లో జగన్ హామీ ఇచ్చేశారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత సమర్ధించుకున్నా ఉపయోగం కనబడటంలేదు. ఉద్యోగులు జగన్ను కలిసేముందు ఇదే విషయాన్ని చంద్రబాబునాయుడుతో చాలాసార్లు చెప్పుకున్నా ఫలితం లేకపోయింది.



ఇదే ఉద్యోగులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను కలిసినపుడు కూడా ఎలాంటి హామీ లభించలేదు. వాళ్ళద్దరు ఎలాంటి సానుకూలత చూపని అంశంలో జగన్ ఒక్కడే అనాలోచితంగా తొందరపడి హామీఇచ్చేశారు. అప్పుడిచ్చిన హామీతో ఇపుడు ఉద్యోగుల దగ్గర ఇరుక్కుపోయారు. ఇక్కడ గమనించాల్సిందేమంటే 2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారికి సీపీఎస్సే వర్తిస్తుందని అందరికీ తెలుసు. అంటే సీపీఎస్ విధానానికి అంగీకరించే ఉద్యోగాల్లో చేరారు.




ఉద్యోగంలో చేరేసమయంలో సీపీఎస్ విధానానికి అంగీకరించి చేరిన తర్వాత ఇపుడు సీపీఎస్ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించటంలో ఉద్యోగులది కూడా తప్పుంది. అంటే తప్పు రెండువైపులా కనబడుతోంది. కాబట్టే ప్రభుత్వం సీపీఎస్-ఓపీఎస్ కు మధ్యేమార్గంలో జీపీఎస్ (గ్యారెంటీడ్ పెన్షన్ స్కీం) విధానాన్ని ప్రతిపాదించింది. ఉద్యోగ సంఘాల నేతలు సీపీఎస్ విధానం కోసం మంకుపట్టుపట్టకుండా  ప్రభుత్వం ప్రతిపాదించిన జీపీఎస్ విధానంపై ఓపిగ్గా ఆలోచించిస్తే బాగుంటుంది. జీపీఎస్ విధానంలో ఇటు ప్రభుత్వానికి అటు ఉద్యోగులకు నష్టం లేకుండా ఉన్న పాయింట్లపై చర్చలు జరిపితే ఉభయులు లాభపడతారు. కాదు కూడదంటే ఉద్యోగులే నష్టపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: