పవన్ ని మరీ అంతలా తీసిపారేశారేంటి..?

Deekshitha Reddy
పవన్ కల్యాణ్ పై ఇటీవల వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు చూస్తూనే ఉన్నాం. కొత్తగా మంత్రి పదవుల్లోకి వచ్చినవారు మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. ఓ దశలో పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని కూడా టార్గెట్ చేస్తున్నారు. పవన్ తో ఫలానా టైటిల్ తో సినిమా చేయాలని, ఆయనకి ముగ్గురు హీరోయిన్లు కావాలని.. ఇలా రకరకాలుగా సెటైర్లు వేస్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి పేర్ని నాని, పవన్ పై మరోసారి ధ్వజమెత్తారు. గతంలో ఆయనకు పవన్ కల్యాణ్ కు మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికీ గుర్తుండే ఉంటుంది. సినిమా ఫంక్షన్లో పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలకు అప్పట్లో మంత్రి హోదాలో పేర్ని నాని ఘాటుగా బదులిచ్చారు. ఆ ఎపిసోడ్ తర్వాత మళ్లీ ఇప్పుడు నాని వర్సెస్ కల్యాణ్ ఎపిసోడ్ మొదలయినట్టుగా అనిపిస్తోంది. రెండో ఎపిసోడ్ లో కూడా పవన్ ని టార్గెట్ చేశారు నాని.

మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఇటీవల మీడియాకు దూరంగా ఉంటున్న నాని, తొలిసారిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు. ఆయన చంద్రబాబుకి దత్తపుత్రుడు కాదని, బంటు, బానిస అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబుపై పవన్ ఎక్కడలేని ప్రేమ కురిపిస్తున్నారని, బాబు సీఎం కావడమే పవన్ లక్ష్యమని.. ఆయనకు రాజకీయాల్లో విలువలు లేవని చెప్పారు. పవన్ కల్యాణ్, చంద్రబాబుపై చూపిస్తున్న ప్రేమను ఆయన అన్నయ్య చిరంజీవిపై ఎందుకు చూపించడంలేదని, కనీసం చిరుపై ఆ అభిమానం చూపించినా బాగుండేదని చెప్పారు నాని.

పవన్ కల్యాణ్ ని ఇటీవల వైసీపీ నేతలు దత్తపుత్రుడు అంటూ విమర్శిస్తున్నారు. కానీ పేర్ని నాని మాత్రం బానిస అనేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు అజెండాతో పనిచేస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో తనకు మంత్రి పదవి పోయిందన్న బాధ లేదని, తనపై సీఎం జగన్ చూపిస్తున్న ప్రేమ, అభిమానం చాలని అన్నారు నాని. ప్రస్తుతం నాని కృష్ణా జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడుగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో వచ్చేఎన్నికల్లో నూటికి నూరుశాతం వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచేందుకు తనవంతుగా కృషి చేస్తానన్నారు నాని. వచ్చే నెలనుంచి గడప గడప కార్యక్రమాన్ని చేపడతానని చెప్పారు నాని.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: