అమరావతి : పార్టీ సభ్యులే టీడీపీకి ఓట్లేయలేదా ?

Vijaya



తెలుగుదేశంపార్టీ సభ్యత్వ నమోదు మొదలైన నేపధ్యంలో ఇపుడిదే చర్చ మొదలైంది. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పట్లో చంద్రబాబునాయుడు అయినా నారా లోకేష్ అయినా ఎక్కడ మాట్లాడినా దేశంలోని మరేపార్టీకి లేనంత పటిష్టమైన కార్యకర్తల బలం తమకుందని చెప్పుకునేవారు. పార్టీకి అధికారికంగానే 60 లక్షల మంది సభ్యులున్నారంటే చాలాసార్లే చెప్పుకున్నారు.



తాజాగా సభ్యత్వ నమోదు మొదలైన తర్వాత మొదలైన చర్చ ఏమిటంటే సభ్యత్వం తీసుకున్నవారే పార్టీకి ఓట్లేయనపుడు ఇక సభ్యత్వ నమోదు చేసి ఉపయోగం ఏమిటని . తండ్రీ, కొడుకులు చెప్పుకున్నట్లుగా పార్టీకి 70 లక్షల సభ్యత్వం ఉన్నదే వాస్తవమైతే ఘోరంగా ఓడిపోయి పార్టీ 23 సీట్లకు మాత్రమే ఎందుకు పరిమితమైంది ? పార్టీకి 70 లక్షల సభ్యత్వాలున్నాయంటే చేతిలో 60 లక్షల ఓట్లున్నట్లే కదా అర్ధం ?



70 లక్షల ఓట్లను 175 నియోజకవర్గాలకు సగటున చూస్తే 40 వేల ఓట్లొస్తాయి. అంటే పార్టీ చేతిలో ఉన్న 40 వేలఓట్లను పక్కనపెడితే పార్టీ సానుభూతిపరులు, సభ్యత్వం తీసుకోకపోయినా చంద్రబాబును అభిమానించే సెక్షన్లుంటాయి. ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేయటం ఇష్టంలేని వాళ్ళు కూడా టీడీపీకి ఓట్లేసే అవకాశాలున్నాయి. ఇవన్నీ లెక్కేసుకుంటే పార్టీకి ప్రతి నియోజకవర్గంలోను సగటున 50-60 వేల ఓట్ల మధ్య పడాలి.



నిజంగానే పార్టీకి అన్ని ఓట్లుపడుంటే  టీడీపీ 23 సీట్లకు మాత్రమే ఎందుకు పరిమితమవుతుంది ? అంటే ఇక్కడ అర్ధమవుతున్నదేమంటే పార్టీ సభ్యత్వం తీసుకున్న వారు కూడా టీడీపీకి ఓట్లేయలేదని. ఇప్పుడు సభ్యత్వం తీసుకున్నా రేపటి ఎన్నికల్లో గ్యారెంటీగా ఓట్లేస్తారా ?  ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా సభ్యత్వం తీసుకున్న వారు, సానుభూతిపరులు ఓట్లేసినంత మాత్రాన సాధ్యంకాదు. సమాజంలో ఏ పార్టీకి సంబంధంలేని న్యూట్రల్స్ ఉంటారు. వారి ఓట్లే చాల కీలకం. న్యూట్రల్స్ ఓట్లలో ఎక్కువ ఎవరికి పడుతుందో వాళ్ళే గెలుపుకు దగ్గరలో ఉంటారు. కాబట్టి ఇపుడు టీడీపీ సభ్యత్వం తీసుకునే వారంతా వచ్చే ఎన్నికల్లో పార్టీకి ఓట్లేస్తారో లేదో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: