ఆత్మహత్య చేసుకోవాలనుకున్న పవన్ కల్యాణ్‌?

Chakravarthi Kalyan
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా.. జీవితంలో ఒక దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయారా.. అలాంటి పవన్ కల్యాణ్‌ కు నాగబాబు కౌన్సెలింగ్ ఇచ్చి మళ్లీ మామూలు మనిషిని చేశారా.. అంటే అవునంటున్నారు. ఈ విషయాన్నే స్వయంగా పవన్ కల్యాణే చెప్పారు. నిన్న అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించిన పవన్ కల్యాణ్‌.. అక్కడ నిర్వహించిన ఓ రచ్చబండ కార్యక్రమంలో కౌలు రైతులను ఉద్దేశించి మాట్లాడారు.


ఆ సమయంలో పవన్ ఈ విషయం బయటపెట్టారు. తానూ ఓసారి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని.. అప్పుడు తన అన్న నాగబాబు తనను ఆపారని.. తనకు కౌన్సెలింగ్ ఇచ్చారని అన్నారు. ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం పడే బాధ ఏంటో తనకు తెలుసన్నారు పవన్ కల్యాణ్. అందుకే అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే జనసేన కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించామని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.


రైతు కష్టం తనకు స్వయంగా తెలుసు కనుకే తాను స్వయంగా వెళ్లి పరామర్శిస్తున్నానని పవన్ కల్యాణ్‌ అన్నారు. వైసీపీ హయాంలో దాదాపు 3 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న పవన్ కల్యాణ్‌... ప్రతి ఒక్క రైతుకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.  కౌలు రైతుకు అండగా ఉండాలన్న పవన్ కల్యాణ్‌... వారి కుటుంబాల్లో భరోసా నింపాలనే ఈ యాత్ర ప్రారంభించానన్నారు.


ఆయన పలు కుటుంబాలను పరామర్శించి, రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు.  రైతు కుటుంబాలను జనసేన పార్టీ తరఫున పరామర్శిస్తున్నామని తెలిసీ ఇప్పుడు ప్రభుత్వం నిద్రలేచిందన్నారు పవన్ కల్యాణ్‌. ఇప్పుడు హుటాహుటిన రైతుల కుటుంబాలకు నష్టపరిహారం అందిస్తున్నారని.. ఏడాదిన్నర క్రితం చనిపోయిన వ్యక్తులకు కూడా ఇప్పుడు వారి కుటుంబ సభ్యుల బ్యాంకు అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని విమర్శించారు. జనసేనకు పొలిటికల్ మైలేజ్ రాకూడదని చేసినా... ఇప్పటికైనా కళ్లు తెరచి నష్టపరిహారం అందించినందుకు థ్యాంక్స్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: