అమరావతిపై హైకోర్టుకు జగన్ సర్కార్ షాకింగ్ నివేదిక?
నెల లోపు రైతులకు ప్లాట్లు అందించాలని.. ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలని.. రాజధానిని మార్చడం కుదరదని.. ఆ అధికారం అసెంబ్లీకి లేదని హైకోర్టు తన తీర్పులో చెప్పిన సంగతి తెలిసిందే. హైకోర్టు తన తీర్పులో ఈనెల 3 లోగా ప్రభుత్వం అఫిడవిట్ వేయాలని ఆదేశించింది.
హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం వెళ్తుందని కొందరు భావించినా జగన్ సర్కారు ఆ పని చేయలేదు. కానీ.. హైకోర్టు తీర్పు ఆచరణ సాధ్యంగా లేదని అసెంబ్లీలోనే చెప్పేసింది. తాజాగా రాజధాని పట్ల హైకోర్టు తీర్పుపై సీఎస్ అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది. సీఆర్డీఏ రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పనులు పూర్తిచేసి నివేదిక ఇవ్వాలని హైకోర్టు అడిగిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.
ఈ అఫిడవిట్‌లో ప్రభుత్వం షాకింగ్ విషయాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సీఆర్డీఏ చట్టంలో పనులు పూర్తి చేసేందుకు మరో నాలుగేళ్లు సమయం పొడిగించామని ప్రభుత్వం తెలిపినట్టు వార్తలు వస్తున్తనాయి. ఈ ప్రభుత్వ నిర్ణయంతో 2024 జనవరి వరకు సమయం ఉందని ఈ అఫిడవిట్‌లో పేర్కొన్నట్టు తెలుస్తోంది. రిజిస్ట్రేషన్లకు సిద్ధంగా 17,357 ప్లాట్లను అసైన్డ్ చట్టాన్ని ఉల్లంఘించి అమ్మకాలు జరగడంతో కేసులు నమోదు అయ్యాయని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో తెలిపింది.
ఈ ప్లాట్ల విషయంలో 1,598 కేసులు నమోదు అయ్యాయని.. వీటిపై దర్యాప్తు కొనసాగుతోందని హైకోర్టు ఇచ్చిన అఫిడవిట్‌లో తెలిపింది. అంతే కాదు.. హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం ఇంకా అధ్యయనం చేస్తోందని.. ఈ తీర్పుపై అప్పీల్‍కు వెళ్లాలా? లేదా? అనే అంశంపై అధ్యయనం కొనసాగుతోందని ప్రభుత్వం అఫిడవిట్‌లో చెప్పిందట. రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం అప్పులు తెచ్చిందని.. వాటికి వడ్డీ చెల్లింపులు చేయాలని.. ప్రభుత్వానికి నిధుల కొరత ఉందని.. ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రభుత్వానికి ప్రాధాన్యత ఇస్తోందని అఫిడవిట్ లో తెలిపినట్టు సమాచారం.